నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవీకి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ ఎంపీలు ఆందోళనలను ఉధృతం చేశారు. ఢిల్లీలోని గాంధీ స్మారక్ వద్ద సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు శాంతియుత ధర్నా చేపట్టనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఎంపీలు రాజ్ ఘాట్ వైపు వెళ్లేందుకు బస్సులో తరలివెళ్లారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో జరిగిన అవకతవకలపై విపక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వాచన్ సదన్‌కు పాదయాత్ర చేపట్టారు, బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలు తాజాగా గాంధీ స్మారక్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మొత్తంగా మూడో రోజు ఎంపీలు రాజ్ ఘాట్ వైపు తరలివెళుతున్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఖర్గే మాట్లాడుతూ.. “మేము, ఇండియా కూటమి సభ్యులం, శాంతియుత ధర్నా చేపట్టేందుకు గాంధీ స్మారక్ వద్దకు వెళ్తున్నాము. మేము అక్కడ కూర్చుని, బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, వారి చర్యలు దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేవని గ్రహించే వివేకం కలగాలని ప్రార్థిస్తాము” అని అన్నారు.






కామెంట్‌లు (0)