నవతెలంగాణ - హైదరాబాద్:
పత్తిచేనులో పత్తి తీయుటకు వెళ్లిన లలిత అలియాస్ మంజూల (33)ను పాము కాటు వేసిన ఘటన జోగులాంబ జిల్లా ఇటిక్యాల మండలం గోపాల్‌దిన్నెలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూలాగే మంజూల పత్తి చేనులో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా పాము కాటు వేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్పందించిన తోటి కూలీలు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే విషం ఒళ్ళంతా పాకడంతో పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. మంజూలకు భర్త గోపాల్, ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. ఆమె మరణంతో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






కామెంట్‌లు (0)