Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ మారణహోమంపై చర్య తీసుకోండి

ఇజ్రాయిల్‌ మారణహోమంపై చర్య తీసుకోండి

- Advertisement -

– అంతర్జాతీయ సమాజాన్ని కోరిన పాలస్తీనా
గాజా :
అంతర్జాతీయ సమాజం తన బాధ్యతను నిర్వర్తించి గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమంపై చర్య తీసుకోవాలని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సేన్‌ అహాబెకియాన్‌ షాహిన్‌ కోరారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ముందు ఆమె అల్‌ జజీరా ఛానల్‌తో మాట్లాడారు. గాజా నగరంపై పట్టు బిగించేందుకు హమాస్‌తో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేయాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో…అంతర్జాతీయ చట్టాన్ని, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అనుసరించి ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని షాహిన్‌ భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. గాజా సిటీని హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయిల్‌ ప్రణాళికపై పలు ప్రపంచ దేశాల నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇప్పటికే ఇజ్రాయిల్‌కు దౌత్యపరమైన, సైనిక సహకారాన్ని అందిస్తోందని షాహిన్‌ గుర్తు చేశారు. సమస్యకు పరిష్కారం కనుగొనాలని అమెరికా చెబుతోందని, అయితే ఏ చర్య తీసుకున్నప్పటికీ పాలస్తీనా హక్కులను విధిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పాలస్తీనా హక్కులను గౌరవించని పక్షంలో ఇజ్రాయిల్‌-పాలస్తీనాలో కానీ, మధ్యప్రాచ్యంలో కానీ, ఆ మాటకొస్తే ప్రపంచంలో కానీ శాంతి నెలకొనబోదని చెప్పారు. గాజా భవిష్యత్‌ పాలనపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలపై షాహిన్‌ మండిపడ్డారు. తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకోవాల్సింది పాలస్తీనియన్లేనని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పుడు ఉన్న చట్టబద్ధమైన, రాజకీయ సంస్థ పీఎల్‌ఓ మాత్రమేనని తెలిపారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ సైనికులు, సెటిలర్ల దాడులపై చర్యలు చేపట్టడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, అంతర్జాతీయ సమాజం తన బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని షాహిన్‌ అన్నారు. ‘పాలస్తీనాలో గత 22 నెలలుగా జరుగుతున్నది మారణహోమం మినహా మరేమీ కాదు. ఆక్రమిత పాలస్తీనాను పూర్తిగా తన గుప్పిట్లో ఉంచుకోవాలన్న ఇజ్రాయిల్‌ విస్తరణవాదంలో ఇది ఓ భాగమే’ అని షాహిన్‌ ఆరోపించారు. కాగా తమను బలవంతంగా గాజా నుంచి తరిమేయాలన్న ఇజ్రాయిల్‌ నిర్ణయాన్ని పాలస్తీనియన్లు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. గాజాలో ఇప్పటికే మానవతా సంక్షోభం తీవ్రంగా ఉన్నదని, ఇజ్రాయిల్‌ ప్రణాళిక అమలైతే పరిస్థితి మరింత దారుణంగాతయారవుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతారని మానవ హక్కుల బృందాలు, ఐరాస హెచ్చరించాయి. అయితే ఇజ్రాయిల్‌ మాత్రం తన పట్టు వీడడం లేదు. హమాస్‌ నుంచి గాజాకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెబుతోంది. గాజా సిటీని హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయిల్‌ నిర్ణయంపై అమెరికా నేరుగా స్పందించడం లేదు. కానీ గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయిల్‌ భావిస్తే తాను అడ్డుకోబోనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img