- క్యాంప్ ఇంచార్జి…పిట్టల అంజయ్య….
- నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
- తెలంగాణ రాష్ట్ర క్రీడా సాధికారత సంస్థ, జిల్లా యువజన క్రీడల శాఖలు సంయుక్తంగా నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఖో ఖో జాతీయ క్రీడాకారుడు, క్యాంపు ఇంచార్జీ పిట్టల అంజయ్య కోరారు. భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో మే 1 నుండి మే 31 వరకు నిర్వహించే వేసవి శిక్షణా శిబిర మైదానాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అనాజీపురం, చుట్టుప్రక్కల గ్రామాల్లోని పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 14 సంవత్సరాలలోపు పిల్లలకు వేసవి శిక్షణ శిబిరంలో ఖో-ఖో, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, క్రీడలలో శిక్షణ ఇస్తారని ఆయన అన్నారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయడానికి వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. తమ పిల్లలను చరవాణి, చెడు వ్యసనాల వైపు వెళ్ళకుండా, క్రీడలపై ఆసక్తి కల్పించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. వేసవి శిక్షణ పూర్తిచేసుకున్న బాలబాలికలకు “పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు” అందజేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు శ్రీశైలం, సాయిరాం, ఇంద్రయ్య , సందీప్ ఎం.డి. అజార్, సోహెల్, గణేష్ లు పాల్గొన్నారు.
- Advertisement -