– వినియోగదారులకు చేరువలో విద్యుత్ సిబ్బంది
– అంతరాయం లేని సరఫరా, నాణ్యమైన సేవలే లక్ష్యం
– ప్రమాదాల నివారణకు చర్యలు
– టోల్ ఫ్రీ 1912 కాల్ తో తక్షణ స్పందన
– ఎన్పీడీసీఎల్ ఏడీఈ (ఆపరేషన్స్) వెంకటరత్నం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంతరాయం లేని విద్యుత్ సరఫరా,మెరుగైన సేవలు,వినియోగదారులకు చేరువలో సిబ్బంది ఉండే విధంగా ఎన్పీడీసీఎల్ నూతన వరవడి తో ప్రజా బాట కార్యక్రమం చేపట్టిందని ఆ సంస్థ అశ్వారావుపేట సబ్ డివిజన్ ఆపరేషన్స్ విభాగం ఏడీఈ బి.వెంకట రత్నం తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని అచ్యుతాపురం లో నిర్వహించిన ప్రజా బాట లో పాల్గొని విద్యుత్ పరంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్ సరిహద్దుల పోలయ్య ను అడిగితెలుసుకున్నారు. అనంతరం అశ్వారావుపేట లోని తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు మేరకు,ఎన్పీడీసీఎల్ ఆద్వర్యంలో ఈ ప్రజా బాట ను నిర్వహిస్తున్నామని తెలిపారు.వారం లో మూడు నాలుగు సార్లు గ్రామాల్లోకి వచ్చే విద్యుత్ సిబ్బంది సరఫరాలో అంతరాయం,లైన్ లో లో ఏర్పడిన వైఫల్యం,లో ఓల్టేజీ సమస్యలను తెలుసుకుంటారని,అందులో తక్షణమే చేయగలిగిన పనులు అప్పటికప్పుడే సరి చేస్తారని అన్నారు.
ప్రమాదాలు నివారణకు శిధిలమైన కేబుల్స్ స్థానంలో 20 కి.మీ కొత్త కేబుల్ ఏర్పాటు చేయడం తో పాటు ఇప్పటికే 300 మిడిల్ పోల్స్ వేయడం జరిగిందని,మరో నాలుగు వందలు పోల్స్,న్యూ కండక్టర్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
అశ్వారావుపేట పట్టణంలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 20 కి పైగా నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసామని,వినాయక పురంలో లో ఓల్టేజి సమస్య పరిష్కారానికి పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి విద్యుత్ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని అన్నారు.



