జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి
అది దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తుంది : వైద్య నిపుణుల సూచన
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 16 సంవత్సరాల అహానా తీవ్రమైన పేగు సమస్యతో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జంక్ ఫుడ్, పేగు ఆరోగ్యంపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఆసుపత్రుల నివేదికలు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం… ఇంటిలో వండిన భోజనంపై ఆమెకు అయిష్టత ఏర్పడింది. దీంతో ఆమె పిజ్జా, బర్గర్, చోమెయిన్, మ్యాగీ వంటి ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్‌ను తరచుగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఫలితంగా కొన్ని నెలల పాటు తీవ్రమైన కడుపు నెప్పితో బాధపడింది. ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెరుగైన, ఆధునిక చికిత్స కోసం ఆమెను చేర్చారు. వైద్య నివేదికల ప్రకారం ఆమె పేగుకు చిల్లులు పడ్డాయి. తీవ్రమైన ఇనెఫెక్షన్ సోకింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని సోషల్ మీడియా పోస్టులు మాత్రం ఆమె పిజ్జా, మ్యాగీ తినడం వల్లనే చనిపోయిందంటూ ప్రచారం చేశాయి.
ఆధారాలు లేవు కానీ…
పిజ్జాలు, ఇన్‌స్టెంట్ నూడుల్స్ వంటి వాటిని అప్పుడప్పుడు తింటే పేగులకు చిల్లులు పడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యూఢిల్లీకి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మీరా గుప్తా తెలిపారు. పీచు పదార్థం (ఫైబర్) తక్కువగా ఉన్న, ఆల్ట్రా-ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు పేగుల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. అవి వాపును పెంచుతాయని, కాలక్రమేణా గ్యాస్ట్రిక్, ఇతర పేగు సంబంధమైన రుగ్మతలకు దారితీస్తాయని, పోషక లోపాలు ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని వివరించారు. జీర్ణాశయం లోపలి భాగాలపై పరిశోధనలు చేసే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉండే అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు పేగుల మైక్రో బయోటాను మారుస్తాయి. వాపును పెంచుతాయి. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకొనే వారితో పోలిస్తే కౌమార దశలో ఉన్న వారు ఫాస్ట్‌ఫుడ్‌ను వినియోగిస్తే రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పేగుల కదలికలు ఆరోగ్యకరంగా ఉంటాయి. సూక్ష్మజీవుల సమతుల్యత జరుగుతుంది.
పేగుల రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది
జంక్ ఫుడ్‌ను తీసుకున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. నాసిరకం ఆహారం పేగులలో నేరుగా రంధ్రాన్ని కలిగించదు. అది కొన్ని నెలలు, సంవత్సరాల సమయం తీసుకొని పేగుల రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీర్ఘకాలిక మంట, ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుంది. ఆహార సంబంధమైన అనారోగ్యాలు లేదా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు పేగులో చిల్లులకు కారణం కావచ్చు. అప్పుడు ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. పిజ్జా, మ్యాగీ తినడం వల్లనే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది పేగుల కదలికలకు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు దోహపడుతుంది. ఆల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాన్ని పరిమితం చేసుకోవాలి. అది ప్రాణాంతకం కాదు కానీ దానిలో పోషకాలు స్వల్పంగా ఉంటాయి. డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచించారు. ఎందుకంటే డీహైడ్రేషన్ మలబద్ధకాన్ని, జీర్ణ వ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నిరంతరం కడుపు నెప్పి, జీర్ణక్రియలో మార్పులు కన్పిస్తుంటే సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం అవసరం.
పేగుల ఆరోగ్యం జాగ్రత్త !
- Advertisement -
- Advertisement -



