Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా చర్యలు

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా చర్యలు

- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖలో చర్యలు చేపట్టాలని సీఎస్‌ కె రామకృష్ణారావు సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఇంధన, వైద్య, ఆరోగ్య, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్‌, టీజీఐఐసీ, భారత ఫ్యూచర్‌ సిటీ , ఇరిగేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మూసీ సుందరీకరణ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ తదితర శాఖల పనితీరుపై విభాగాల వారీగా సమీక్ష చేశారు.

ఇంధన శాఖ:
ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, టీజీట్రాన్స్‌కో, టీజీ జెన్‌కో, టీజీ ఎస్‌పీడీసీిఎల్‌, టీజీ ఎన్‌పీడీసీఎల్‌ విభాగాల్లో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ ఆదేశించారు.

పునరుత్పాదక ఇంధన రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రాజెక్టుల అమలులో నిర్ణీత కాలపరిమితులను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ రంగంలో అమలవుతున్న విధానాన్ని పరిశీలించి రాష్ట్రంలో వివిధ డిస్కంలలో అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్రంలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిపై సీఎస్‌కు అధికారులు వివరించారు. ఇ-గవర్నెన్స్‌ అంశాలు, అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌, విజన్‌ 2047 లక్ష్యాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాల మేరకు ప్రతిపాదించిన చంద్రవెళ్లి, రాయదుర్గం, షాద్‌నగర్‌, పరిగిలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల పనుల పురోగతి పై సీఎస్‌ సమీక్షించారు.

వైద్య ఆరోగ్య శాఖ:
రాష్ట్రంలో వరంగల్‌, ఆల్వాల్‌, సనత్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, న్యూ ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణ పలు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల పురోగతి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, వైద్య సదుపాయాల లభ్యత, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల సరఫరా, వైద్య శాఖలో నర్సింగ్‌, వైద్యుల నియమకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇహెచ్‌ఎస్‌ పథకం, వైద్య పరికరాల సరఫరా తదితర అంశాలపై సీఎస్‌ సమీక్షించారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్‌, టీజీఐఐసీ:
ఐటీఈడీసీ శాఖలో ప్రస్తుత కార్యకలాపాలు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలపై అధికారులు సీఎస్‌కు వివరించారు. ముఖ్యంగా డిజిటల్‌ గవర్నెన్స్‌, ఐటీ పెట్టుబడుల ఆకర్షణ, స్టార్టప్‌ ఎకోసిస్టం అభివృద్ధి, ఈ-గవర్నెన్స్‌ సేవల విస్తరణ, సైబర్‌ సెక్యూరిటీ, రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో టి ఫైబర్‌ విస్తరణ పై సమీక్ష చేశారు. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరింత పోటీగా నిలిపే దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇరిగేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మూసీ సుందరీకరణ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ విభాగాల్లో చేపట్టిన ప్రాజెక్టలపై సీఎస్‌ సమీక్షించారు. గత మూడు రోజులుగా ఇప్పటి వరకు (13) విభాగాలను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. రాబోయే రెండు రోజుల్లో మిగతా విభాగాల సమీక్షకు సిద్ధమవుతున్నారు. సమావేశంలో ఆయా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారని సమాచార పౌర సంబంధాల శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -