Sunday, January 18, 2026
E-PAPER
Homeసోపతితమిళ సినిమా రాణి టి.పి.రాజలక్ష్మి

తమిళ సినిమా రాణి టి.పి.రాజలక్ష్మి

- Advertisement -

నూరేళ్ల నాడు మహిళల జీవితాలకు సంబంధించిన పితృస్వామ్య వ్యవస్థ ఏర్పరచిన కట్టుబాట్లను ఛేదించుకుని ఒక సాధారణ బ్రాహ్మణ యువతి నాటక రంగంలోకి ప్రవేశించి ఆ తదుపరి దక్షిణ భారత సినిమా రంగంలో చరిత్ర సృష్టించింది. జన్మతః తనకు అడ్డుగా ఉన్న సాంప్రదాయ సమాజపు పరిమితులను ఎడంచేత పక్కకు విసిరి కొట్టి సినీ నటిగా, నర్తకిగా, దక్షిణ భారతంలో తొలుత ఒక సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించిన మహిళగా చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నది. ఆమెనే టి.పి. రాజలక్ష్మి.

టి.పి. రాజలక్ష్మి తిరువయూరుకు చెందిన పంచ పాకేశ శాస్త్రి గారి ఇంట 1911 నవంబర్‌ 11న జన్మించింది. ఆయన సేలై మంగళం గ్రామానికి కరణంగా పనిచేసేవారు. బాల్యం నుండే తాను ఏ పాట విన్నా మళ్ళీ అచ్చం అలాగే పాడే ప్రతిభను కలిగి ఉన్న రాజలక్ష్మి చదువుకున్నది 5వ తరగతి వరకే. ఆమె కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండేది. ఈ దుస్థితికి తోడు, ఎనిమిదేళ్లకే ముత్తుమణితో ఆమె పెళ్లి చేశారు. కట్నం వివాదం కారణంగా ఆమె అత్తవారింటికి వెళ్లలేదు. దాంతో ఆ వివాహం అంతటితో ముగిసిపోయింది. కొద్దికాలానికి ఆమె తండ్రి మరణించాడు. తర్వాత బ్రతుకు తెరువు కోసం వారి కుటుంబం తిరుచ్చికి తరలి వెళ్ళింది. తిరుచ్చిలో తన కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత రాజలక్ష్మిపై పడింది. జీవనోపాధి కోసం ఆమె నెలకు ముప్పై రూపాయల పారితోషికానికి ఒక నాటక సంస్థలో చేరింది.

మరోవైపు ”ఆ కుటుంబాన్ని సమాజం వెలివేసింది,” కానీ ఇవేవీ ఆమెను ఆపలేకపోయింది. ఆమె స్వతహాగా మంచి కంఠం కలిగి ఉండటంతో నాటకాల్లో తొలుత చిన్న, చిన్న వేషాలు వేసింది. ఇందుకు తమిళ నాటక పితామహుడైన శంకర్‌ దాస్‌ స్వామిగల్‌ ఆమెకు చాలా సాయం చేశాడు. ‘పావలక్కోడి’ నాటకంలో నటించిన తర్వాత ఆమెకు నాటక రంగంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినవి. ఆ తర్వాత ఈ నాటకం ఆధారంగా నిర్మించిన పావల కోడి చిత్రం ద్వారా ప్రముఖ తమిళ గాయక నటుడు ఎం.కె. త్యాగరాయ భాగవతారు సినీ జీవితానికి తొలి చిత్రం అయింది. ఆ తర్వాత రాజలక్ష్మి ఆర్యగాన కె.ఎస్‌. చెల్లప్ప నాటక కంపెనీలో చేరింది. కొద్ది కాలానికి కె.పి. మొయిదీన్‌ సాహిబ్‌ బృందంలోకి మారింది, అక్కడ ఆమె మూడు సంవత్సరాలు పనిచేసింది. ఈ నాటక సంస్థలతో కలిసి ఆమె రంగూను వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శనలలో పాల్గొన్నది. ఆ తర్వాత చిన్నయ్య నాటక కంపెనీలో చేరిన రాజలక్ష్మి వీరి నాటకాలలో ‘సీత’ పాత్ర పోషణలో ఎనలేని పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నది.

అదే కాలంలో మద్రాసులో మూగ చిత్రాల నిర్మాణం పెరిగింది. దీంతో నాటక రంగంలో ఉన్నవారు చాలామంది సినిమాలలో నటించడానికి మొగ్గు చూపారు. రాజలక్ష్మి కూడా సినిమా రంగంలోకి ప్రవేశించింది. 1929లో ఆమె ఏ. నారాయణన్‌ జనరల్‌ పిక్చర్స్‌ కార్పొరేషన్‌ కంపెనీలో చేరి ‘కోవలను, ఉషా సుందరి, రాజేశ్వరి’ వంటి సైలెంట్‌ సినిమాల్లో ఆమె నటించింది. ఇంతలో 1931లో ‘ఆలం ఆరా’ సినిమాతో భారతదేశంలో టాకీలు వచ్చినవి. వారే హెచ్‌.ఎం. రెడ్డి డైరెక్షన్‌లో తీసిన తొలి దక్షిణ భాష తెలుగు – తమిళ టాకీ ‘కాళిదాసు’ 1931లో నాయకగా నటించింది. ఆ చిత్రంలో ఆమె వాగ్గేయకారుడు త్యాగరాజ వారి కృతులను గానం చేసింది. అంతేగాక ఈ చిత్రానికి అనుబంధంగా చేర్చబడిన రీల్స్‌లో తమిళ జానపద సాంప్రదాయ కురత్తి నృత్యాన్ని కూడా చేసింది. దీంతో ఆమె తొలి దక్షిణ భారత టాకీ నాయకగా చరిత్రకి ఎక్కింది. ఆ తర్వాత రామాయణ (1932) సత్యవాన్‌ సావిత్రి (1933) చిత్రాల్లో నటించింది. ఇంకా కలకత్తాలో తీసిన ‘కోవలను, ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, గులేబకావళి, లలితాంగి’ వంటి తమిళ సినిమాల్లో ఆమె నాయికగా నటించింది.

కలకత్తా నుండి తిరిగి వచ్చాక ఆమె శ్రీ రాజం టాకీసు అన్న చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తానే స్వయంగా కథ రాసి దర్శక నిర్మాతగానే గాక నాయికగా నటిస్తూ ‘మిస్‌ కమల’ (1936) సినిమా తీసింది. హీరో వి.ఎ. చెల్లప్ప. ‘మిస్‌ కమల’ చిత్రం ఒక సంపన్న యువతి తన క్రూరమైన సంరక్షకుల కారణంగా ఎదుర్కొనే అనేక సమస్యల చుట్టూ తిరుగుతుంది. వారి బారి నుండి ఆమె ఎలా తప్పించుకుని, జీవితంలో తన లక్ష్యాలను ఎలా సాధించిందనేది ఈ కథ. ఆ తర్వాతి చిత్రం కూడా చెల్లప్ప హీరో గానే ‘ఇందియ తాయు’ చిత్రం నిర్మించిందామే. ఇంకా జానపద నృత్య కళా రూపమైన కురత్తి నృత్య ప్రదర్శనలో ఆ కాలంలో ఆమె తర్వాతే ఎవరైనా. 1933లో ఎస్‌. విన్సెంట్‌ ‘వల్లి తిరుమానం’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం రాజలక్ష్మిని స్టార్‌డమ్‌కు చేర్చి ఆమెకు ‘సినిమా రాణి’ అనే బిరుదును సంపాదించి పెట్టింది. వల్లి చిత్రం విడుదలైనప్పుడు, ఒక రీల్‌ పోయింది.

అయినప్పటికీ, ఈ చిత్రం హౌస్‌ఫుల్‌ షోలతో ఆడింది. తరువాత, పోయిన రీల్‌ దొరికిన తర్వాత దాని గురించి వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చారు. అప్పటికే సినిమా చూసిన వారు, తాము చూడని సన్నివేశాలను చూడటానికి రెండవసారి వెళ్లారు. ఈ సమయంలోనే ఆమె తన సహనటుడు టి.వి. సుందరాన్ని కలిశారు. ఆ తర్వాత ఆమె అతడిని వివాహం చేసుకుంది. వారికి కలిగిన ఏకైక సంతానం కమల. ఈ పేరు మీదనే ఆ తర్వాత ‘మిస్‌ కమల’ సినిమా తీసిందామె. తన ‘మిస్‌ కమల’, ‘మధురై వీరన’ చిత్రాలకు దర్శకనిర్మాత గానే గాక ఎడిటింగ్‌ కూడా చూసుకున్నారు. దక్షిణ భారతీయ సినీ చరిత్రలోనే కాదు, భారతీయ సినీ చరిత్రలో కూడా ఇలాంటి విశిష్టతను సాధించిన మొదటి మహిళ ఆమె. ఆమె ఆనాటి ప్రసిద్ధ స్టంట్‌ నటులైన ‘బ్యాట్లింగ’ సి.ఎస్‌.డి. సింగ్‌, ‘స్టంట్‌ రాజు’ లను తన చిత్రాలలో నియమించుకుంది.

రాజలక్ష్మి నట జీవితంలో చెప్పుకోదగిన చిత్రాలు ‘గులేబకావళి (1935), భామ పరిణయం, సీమంతిని (1936), నందకుమార్‌, మధురై వీరన్‌ (1938), భక్త కుమరన్‌, సుగుణ సరాస(1939) ఉత్తమి (1943), (1945), జీవ జ్యోతి(1948), చివరి చిత్రం ఇదయ గీతం (1950)’. రాజలక్ష్మి నటి మాత్రమే కాదు ఆమె స్వయంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె తను నటించి నాటకాలలో, సినిమాల్లో, స్వతంత్ర భావాలను వ్యక్తపరిచే దశ్యాలను చొప్పించిన ఆమె నిజమైన దేశభక్తురాలు. భారత జాతీయ కాంగ్రెస్‌తో సంబంధం కలిగి ఉండేది. ఆమె కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌. సత్యమూర్తికి సన్నిహితురాలు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆమె1939లో ‘ఇండియా తాయ్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలమై, రాజలక్ష్మిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆమె కూడబెట్టిన భారీ ఆస్తి మొత్తాన్ని అమ్ముకోవలసి వచ్చింది. అయినప్పటికీ, సినిమా నిర్మించినందుకు ఆమె పశ్చాత్తాపపడలేదు.

స్వాతంత్య్ర పోరాటానికి తన వంతుగా చేసిన చిన్న కృషి అని చెప్పుకుంది. ఆమె బ్రిటిష్‌ ఇండియన్‌ సెన్సార్లను ధైర్యంగా ఎదుర్కొంది. కానీ టైటిల్‌ను ‘తమిళ్‌ తాయ్’ (1940)గా మార్చడానికి అంగీకరించింది. రాజలక్ష్మి గర్వించదగిన జాతీయవాది. ఆమె తరచుగా వేదికపై దేశభక్తి గీతాలు పాడేది. బ్రిటిష్‌ అధికారులు ఆమెను అరెస్టు చేసేవారు. అప్పుడు నాటక కంపెనీ వారు ఆమెను జైలు నుండి విడిపించేవారు. కాలం గడుస్తున్నది. సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చినవి. కానీ రాజలక్ష్మి ఆ మార్పులను అంగీకరించలేదు. ఆమె తన హుందాతనాన్ని కోల్పోకుండానే శనివారంలో తన ఉనికిని కొనసాగించింది 1935లో ఏ.వి. ముయ్యప్పన్‌ చెట్టియార్‌ ‘నందకుమార్‌’ అన్న సినిమాను తీశాడు. అందులో టి. ఆర్‌. మహా లింగం కృష్ణుడిగా నటించాడు. రాజలక్ష్మి ఆ చిత్రంలో యశోద పాత్రను పోషించింది. ఆ సమయంలో ఆమె తనకు ఇబ్బందికరమైన కాస్ట్యూమ్స్‌ను ఇవ్వగా వాటిని ఆమె ధరించినని తిరస్కరించి తనకు, తన వ్యక్తిత్వానికి సరిపోయే కాస్ట్యూమ్స్‌ని ధరించి సినిమాలో నటించింది.

ఈ నేపథ్యంలో వయసు పెరిగే కొద్దీ, ఆమె సినిమాలలో తల్లి పాత్రలు పోషించడం ప్రారంభించింది. కానీ పాత్రల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరించింది. అలాంటి చిత్రాలలో ఒకటి జీవ జ్యోతి (1947). ఇందులో ఆమె ఒక గౌరవనీయమైన బ్రాహ్మణ తల్లి పాత్రను పోషించింది. మరొకటి జోసెఫ్‌ తలియత్‌ దర్శకత్వం వహించిన విజయవంతమైన చారిత్రక చిత్రం ‘ఇదయ గీతం’ (1950). ఇందులో ఆమె రాణి తల్లి పాత్రలో నటించింది. రాజలక్ష్మి తమిళ సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల హృదయాలలో తమిళ సినిమా రాణిగా ఎనలేని గౌరవ అభిమానాన్ని పొందింది.1961 లోనే ఎం.జీ.ఆర్‌. ఆమెను ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించారు. ఆ సందర్భంగా ఎం.జీ.ఆర్‌. ఆమె ఇంటికి స్వయంగా కారు పంపి గౌరవించారు. నిజానికి ఆ సమయంలో ఆమె సొంత కారులో వెళ్ళలేని స్థితిలో ఉన్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంజీఆర్‌ను ఆమె సహాయం అడిగితే కాదనే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఆమె తన జీవితంలో ఏనాడు ఎవరిని చేయి చాచి అడగకుండా ఆత్మగౌరవంతో బతికింది.

ఒక ఇంటర్వ్యూలో ఆమె కుమార్తె కమల తన తల్లి రాజలక్ష్మి గురించి చెబుతూ ”మా అమ్మ నాకు ఏనాడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రంగంలోకి వెళ్ళవద్దని సూచించింది” అని పేర్కొన్న మాటలు ఆమె జీవిత అనుభవాన్ని మనకు చెప్పకనే చెబుతాయి. సాంప్రదాయకంగా అందగత్తెగా పరిగణించబడకపోయినప్పటికీ, రాజలక్ష్మికి తెరపై ఒక అద్భుతమైన ఆకర్షణ ఉండేది. తన వ్యక్తిగత జీవితంలో, ఆమె తన కాలం నాటి ప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. బాల్య వివాహం వంటి సామాజిక దురాచారాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకా ఆడ శిశుహత్యలను వ్యతిరేకిస్తూ, ఒక ఆడపిల్లకు మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశ్యంతో ఒక అమ్మాయిని దత్తత కూడా తీసుకుంది. రాజలక్ష్మి నివసించిన వీధికి రాజరత్నం వీధి అని పేరు మార్చారు. ఆ వీధిలో ఆమెకి పది నుండి పన్నెండు ఇళ్లు ఉండేవి. రాజరత్నం వీధిలోని ఆమె నివాసానికి నెం. 1 ‘రాజ్‌మహల్‌ అని పేరు పెట్టారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా, స్వాతంత్ర సమరయోధురాలిగా జీవితాన్ని గడిపిన టి.పి రాజలక్ష్మి 1964 ఆగస్టు 20న కన్ను మూసింది. తమిళ సినిమా చరిత్రలోనే కాక భారతీయ సినిమా చరిత్రలో రాజలక్ష్మి జీవితం ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచిపోయింది.

  • హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -