Sunday, September 28, 2025
E-PAPER
Homeజాతీయంతమిళనాట విషాదం

తమిళనాట విషాదం

- Advertisement -

హీరో విజయ్ సభలో తొక్కిసలాట
36 మంది మృతి
వీరిలో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు వందలాదిమందికి గాయాలు


కరూర్‌ : ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. శనివారం కరూర్‌లో జరిగిన ర్యాలీకి భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు. కిక్కిరిసిన ఆ జన సందోహాన్ని ఉద్దేశించి విజరు ప్రసంగిస్తుండగా, తీవ్రంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 36 మంది మరణిం చారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ్ సాగిస్తున్న పర్యటనలో భాగంగా కరూర్‌లోని వేలుచామిపురంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించగా.. విజయ్ సాయంత్రం 6 గంటలకు చేరుకున్నారు. కరూర్‌తోపాటు సమీపంలోని మూడు జిల్లాల నుంచి వచ్చిన విజయ్ అభిమానులు, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ స్వచ్ఛంద కార్యకర్తలు దాదాపు ఆరుగంటలపాటు ఎండలో వేచి ఉన్నారు. ప్రజలు ఎక్కువగా, కిక్కిరిసిపోయి వుండడం, వేడిగా ఉండడంతో సభ జరుగుతుండగానే అనేకమంది ఊపిరాడక కండ్లు తిరిగి పడిపోయినట్టు తెలుస్తోంది.

అభిమానుల్లో కొంతమంది తమ నటుడిని దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతో బస్సు సమీపంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు. వీరిని వెంటనే కరూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రులకు హుటాహుటిన తరలించారు. 500మందికి పైగా ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. మరో 400మందికి పైగా తీసుకువస్తున్నారని సీనియర్‌ పోలీసు అధికారి డేవిడ్సన్‌ దేవాశీర్వాదం తెలిపారు. తొక్కిసలాట సమాచారం అందడంతో షెడ్యూల్‌ సమయానికి కన్నా ముందుగానే విజయ్ తన ప్రసంగాన్ని ముగిం చేశారు. అవసరమైన సాయాన్ని యుద్ధ ప్రాతిపదికన అందజేయాల్సిందిగా ఆదేశించారు. మరోపక్క జనాల రద్దీ బాగా వుండడంతో అంబులెన్సులు అవసర మైన చోటుకు వెళ్లడానికి కూడా బాగా సమయం పట్టేసింది.

దిగ్భ్రాంతికరం : సీపీఐ(ఎం)
విజయ్ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు మరణించడం దిగ్భ్రాంతికరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారిలో ఎక్కువమంది పిల్లలు, మహిళలు ఉండటం తీవ్ర విషాదమని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీపీఐ(ఎం) తరఫున సానుభూతిని తెలియజేశారు.

ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం
కరూర్‌ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెప్పారు. తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీఎం స్టాలిన్‌ అన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి రూ.1 లక్ష పరిహారం అందించనున్నట్టు వివరించారు. శనివారం రాత్రి 9.40 గంటలకు సచివాలయానికి వచ్చిన ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆయన కరూర్‌ వెళ్లనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -