పసిడి పోరులో యువ షట్లర్ ఓటమి
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్
గువహటి : భారత యువ షట్లర్ తన్వి శర్మ (16) ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించింది. టాప్ సీడ్ తన్వి శర్మ ఆదివారం గువహటిలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్, థారులాండ్ షట్లర్ అన్యపత్ చేతిలో తన్వి శర్మ పరాజయం పాలైంది. 28 నిమిషాల్లోనే ముగిసిన పసిడి పోరులో 15-7, 15-12తో అన్యపత్ వరుస గేముల్లో గెలుపొందింది. రచనోక్ (2009, 2011), పిచ్‌మాన్ (2023) తర్వాత ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన మూడో థారులాండ్ షట్లర్‌గా అన్యపత్ నిలిచింది. తొలి గేమ్‌లో తడబడిన తన్వి శర్మ.. రెండో గేమ్‌లో పుంజుకుంది. కానీ మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లటంలో విఫలమైంది. 17 ఏండ్ల తర్వాత ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పతకం సాధించిన తన్వి శర్మ.. అపర్ణ పోపట్ (1996), సైనా నెహ్వాల్ (2006), సిరిల్ వర్మ (2015), శంకర్ ముతుసామి (2022) తర్వాత సిల్వర్ మెడల్ నెగ్గిన ఐదో భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది.