Wednesday, March 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుశత్రు స్థావరాలపై గురి

శత్రు స్థావరాలపై గురి

- Advertisement -

డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్న ఇరాన్‌ .. హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయిల్‌ దాడులు
నాలుగో రోజు భీకరపోరు
787కు చేరిన మృతులు
భూతల పోరుపై ఇజ్రాయిల్‌, అమెరికా భిన్నాభిప్రాయాలు
అమెరికా ఎంబసీలపై విరుచుకుపడుతున్న ఇరాన్‌
ఆరుగురు అమెరికన్‌ సైనికులు మృతి

ఆగని ట్రంప్‌ బెదిరింపులు
అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు, ఇరాన్‌ దళాల మధ్య వరుసగా నాలుగో రోజు కూడా భీకర పోరు జరిగింది. మరోవైపు హిజ్బొల్లా కూడా రంగంలోకి దిగడంతో మధ్యప్రాచ్యంలో భయానక వాతావరణం కన్పిస్తోంది. బీరుట్‌లోని హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ మంగళవారం పెద్ద ఎత్తున దాడులు చేసింది. అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. హార్మూజ్‌ జలసంది వద్ద 700లకు పైగా నౌకలు నిలిచిపోయాయి. ఆ మార్గం గుండా నౌకలు వెళితే పేల్చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. మరోవైపు అమెరికా ప్రతి రోజు యుద్ధం కోసం ఏడువేల కోట్లు ఖర్చుపెడుతుంది. ఇంకోవైపు ట్రంప్‌ బెదిరింపులు ఆగడం లేదు.

నవతెలంగాణ-సెంట్రల్‌ డెస్క్‌
అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు, ఇరాన్‌ దళాల మధ్య వరుసగా నాలుగో రోజు కూడా భీకర పోరు జరిగింది. మరోవైపు హిజ్బొల్లా కూడా రంగంలోకి దిగడంతో మధ్యప్రాచ్యంలో భయానక వాతావరణం కన్పిస్తోంది. బీరుట్‌లోని హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ మంగళవారం పెద్ద ఎత్తున దాడులు చేసింది. అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతంలో ఉన్న హిజ్బొల్లా టీవీ, రేడియో స్టేషన్‌ భవనాలపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో తీవ్ర నష్టం వాటిల్లింది. హెజ్బొల్లాకు చెందిన అల్‌-మనార్‌ టీవీ ప్రసారాలు సుమారు గంట పాటు నిలిచిపోయాయి. ఓ ప్రాథమిక పాఠశాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు జరిపిన వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 160 మంది అమాయక బాలికల అంత్యక్రియల కోసం స్మశాన వాటికలో గోతులు తవ్వారు.

వైమానిక దాడిలో బాలికల శరీరాలు ఛిద్రమై పోయాయి. యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి చెందిన ఏడు ఎమిరేట్స్‌లో ఒకటైన ఫుజైరాలోని చమురు కేంద్రం నుంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అంత కుముందు చమురు కేంద్రంపైకి దూసుకొచ్చిన డ్రోన్‌ను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అయినప్పటికీ శకలాలు చమురు పరిశ్రమ జోన్‌లో పడడంతో మంటలు వ్యాపించాయి. అమెరికా దాడిలో ఇరాన్‌లోని భూగర్భ నతంజ్‌ ఫ్యూయల్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎఫ్‌ఈపీ) ప్రవేశ భవనాలు కొంతమేర దెబ్బతిన్నాయని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్‌ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. అయితే అణుధార్మిక పరిణామాలు సంభవించే ప్రమాదం ఏమీ లేదని చెప్పింది.

భూతల పోరు ఆచరణ సాధ్యం కాదు : ఇజ్రాయిల్‌
ఇరాన్‌ సైనిక, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు జరపగా ఇరాన్‌ కూడా ప్రతీకార దాడులు జరిపింది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరమైంది. భూతల దాడులు జరిపే అవకాశాన్ని తోసిపుచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరాకరించారు. దీర్ఘకాల పోరుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే ఇజ్రాయిల్‌ మాత్రం భూతల దాడులు ఆచరణ సాధ్యం కావని చెప్పింది. మరోవైపు ఒత్తిడికి తలవంచబోమని, అయితే చర్చలకు సిద్ధంగానే ఉన్నామని ఇరాన్‌ తెలిపింది. హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నామని ప్రకటించింది. వ్యూహాత్మక సముద్ర మార్గంలో ప్రయాణించేందుకు ఏ నౌక అయినా ప్రయత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది.

దాడులు-ప్రతి దాడులు.. 787కు చేరిన మృతులు
అమెరికా-ఇజ్రాయిల్‌ దళాలు జరుపుతున్న దాడులలో మరణించిన వారి సంఖ్య 787కు చేరింది. కెర్మన్‌ రాష్ట్రంలో జరిగిన దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన 13 మంది చనిపోయారు. దాడులతో భీతిల్లుతున్న ఇరాన్‌ ప్రజలను తాజాగా భూ ప్రకంపనలు వణికించాయి. దక్షిణ ప్రాంతంలోని గెరాష్‌ సమీపంలో రిక్టర్‌ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఇజ్రాయిల్‌ సేనలు ముందుకు సాగుతుండడంతో సరిహద్దుల వద్ద లెబనాన్‌ ప్రభుత్వం దళాల మోహరింపును పెంచింది. లెబనాన్‌లో మరిన్ని స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ సైన్యానికి అధికారం ఇచ్చారు. సరిహద్దున ఉన్న ప్రజలపై కాల్పులు జరగకుండా నివారించడానికే ఈ చర్య తీసుకున్నామని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ చెప్పారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయిల్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇదిలావుండగా ఫ్రాన్స్‌లోని అక్రోటిరిలో ఉన్న బ్రిటీష్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) స్థావరంపై ఇరాన్‌ డ్రోన్లు దాడి చేశాయి.

దీంతో సైప్రస్‌కు క్షిపణి, డ్రోన్‌ నిరోధక వ్యవస్థలను పంపాలని ఫ్రాన్స్‌ యోచిస్తోంది. ఒమన్‌లోని ఓ ఓడరేవులో ఉన్న ఇంధన ట్యాంకులపై కూడా ఇరాన్‌ డ్రోన్లను ప్రయోగించింది. ఖతార్‌లోని ఇజ్రాయిల్‌, అమెరికా సైనిక స్థావరంపై కూడా ఇరాన్‌ దాడులు చేసింది. త్రివిధ దళాలకు చెందిన విధ్వంసక డ్రోన్లు ఆక్రమిత ప్రాంతాలలోని ఇజ్రాయిల్‌ సైనిక ప్రాంతాలను, అల్‌-ఉదెయిద్‌లోని అమెరికా దళాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్‌ సైన్యం తెలిపింది. కాగా ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయాన్ని, సెక్యూరిటీ కౌన్సిల్‌ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇజ్రాయిల్‌ చెప్పింది. వాటిపై భారీగా ఆయుధాలు ప్రయోగించి ధ్వంసం చేశామని తెలియజేసింది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై కూడా ఇరాన్‌ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆ భవనం స్వల్పంగా దెబ్బతిన్నది.

విమాన సర్వీసుల పునరుద్ధరణ
ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులకు మన రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని, సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని, బయట తిరగవద్దని సూచించింది. రాయబార కార్యాలయం నుంచి అందే సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరింది. ఇరాన్‌లో విద్యార్థులు సహా దాదాపు తొమ్మిది వేల మంది భారతీయులు నివసిస్తు న్నారు. కాగా విమానాశ్రయాలలో చిక్కుబడిపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సహా పలు భారతీయ విమానయాన సంస్థలు మస్కట్‌, ఒమన్‌, జోర్డాన్‌, జెడ్డా తదితర గల్ఫ్‌ నగరాలకు సర్వీసులను పునరుద్ధరించాయి.

దుబాయి, అబూదాబీ విమానయాన సంస్థలు కూడా పరిమిత సంఖ్యలో సర్వీసులు నడుపుతామని తెలిపాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 80 సర్వీసులు, ముంబయి విమానాశ్రయంలో 107 సర్వీసులను రద్దు చేశారు. అలాగే బెంగళూరులో 42 విమానాలు, చెన్నైలో 30 విమానాలు రద్దయ్యాయి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ గత మూడు రోజులలో 1,117 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇదిలావుండగా పవిత్ర రంజాన్‌ మాసంలో ఉమ్రా కోసం మక్కాకు వెళ్లిన వేలాది మంది భారతీయ ముస్లింలు అక్కడే చిక్కుబడి పోయారు. విమాన సర్వీసులు లేకపోవడంతో వారంతా మక్కా, మదీనాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థిక ప్రభావంపై ఇప్పుడేమీ చెప్పలేం : ఐఎంఎఫ్‌
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని, ఇంధన ధరలు పెరుగుతున్నాయని పేర్కొంది. పశ్చిమాసియాపై కానీ, ప్రపంచంపై కానీ పడే ఆర్థిక ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని అంటూ ఘర్షణలు ఎంత కాలం కొనసాగుతాయనే విషయంపై అది ఆధారపడి ఉంటుందని చెప్పింది.

40-45 రోజులకు సరిపడా చమురు నిల్వలు
భారత్‌ వద్ద ప్రస్తుతం వంద మిలియన్‌ బ్యారల్స్‌ వాణిజ్య ముడి చమురు నిల్వలు ఉన్నాయి. దేశం వైపు ప్రయాణిస్తున్న నౌకలలో కూడా భూగర్భ వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. హర్మూజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం స్టోరేజీ ట్యాంకులలో ఉన్న నిల్వలు 40-45 రోజులకు సరిపోతాయి. భారత్‌ ముడి చమురు అవసరాలలో 88 శాతం వరకూ దిగుమతుల ద్వారానే తీరుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాలకు సంబంధించిన ముడి పదార్థాల సరఫరాలలో యాభై శాతానికి పైగా మధ్యప్రాచ్య దేశాల నుంచే జరుగుతోంది. అవి హర్మూజ్‌ జలసంధి మీదుగానే రవాణా అవుతున్నాయి. ఇరాన్‌ సంక్షోభం కారణంగా ఇప్పుడు వాటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. తక్షణ ప్రభావంగా ధరలు పెరుగుతాయి.

రోజు ఖర్చు రూ.ఏడు వేల కోట్లు
ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూరీ పేరిట ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధానికి అమెరికా భారీగానే ఖర్చు పెడుతోంది. ఖర్చుపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమే. కానీ తొలి 24 గంటల యుద్ధంలో అమెరికా పెట్టిన ఖర్చు అక్షరాలా ఏడు వేల కోట్ల రూపాయలని ఓ అంచనా. ఒక్కో యుద్ధ విమాన వాహక నౌక నిర్వహణకు రోజుకు సుమారు రూ.59 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు. యుద్ధంలో ఆయుధాలను కోల్పోవడం సహజమే. అప్పుడు ఆర్థిక నష్టం తప్పదు. ఉదాహరణకు కువైట్‌లో అమెరికా మూడు యుద్ధ విమానాలను కోల్పోయింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇరాన్‌ ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడం అమెరికాకు కష్టమవుతుంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయిల్‌ దళాల వద్ద క్షిపణి నిరోధక వ్యవస్థలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి.

మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన పుతిన్‌
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను కొంతవరకైనా నివారించే విషయంలలో మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందుకొచ్చారు. నాలుగు అరబ్‌ దేశాల నేతలతో ఆయన టెలిఫోన్‌లో సంభాషించారు. ఉద్రిక్తతల నివారణకు ఇరాన్‌తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకుంటానని వారికి తెలిపారు. కాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియా దేశాలే కాకుండా అరబ్‌ దేశాలు కూడా అణ్వాయుధాల సముపార్జనకు ప్రయత్నిస్తాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అణ్వాయుధ వ్యాప్తికి దోహదపడతాయని, అప్పుడు పరిస్థితి మన చేతుల్లో ఉండదని తెలిపారు.

సురక్షిత ప్రాంతాలకు చేరండి : అమెరికా
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్‌ సహా పదిహేను దేశాలలో నివసిస్తున్న అమెరికన్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ట్రంప్‌ ప్రభుత్వం సూచించింది. భద్రా కారణాల రీత్యా వెంటనే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని అమెరికన్లను విదేశాంగ మంత్రి మార్కో రుబియో కోరారు. బహ్‌రైన్‌, కువైట్‌, లెబనాన్‌, ఇరాన్‌, ఇరాక్‌, గాజా, జోర్డాన్‌, ఒమన్‌, ఎమన్‌ దేశాలలోని అమెరికన్లకు కూడా ఈ అడ్వైజరీ జారీ అయింది.

ఈయూ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక
టెహ్రాన్‌ క్షిపణి నిర్మాణ సామర్ధ్యాలను నష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామంటూ యూరోపియన్‌ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేసిన ప్రకటనలపై ఇరాన్‌ మండిపడింది. ‘అలా చేస్తే అది యుద్ధమే అవుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అలాంటి చర్యలు తీసుకుంటే పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతుంది. ఆ చర్యలను ఇరాన్‌పై యుద్ధంగానే పరిగణిస్తాం’ అని విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -