గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
క్షిపణులు, డ్రోన్లతో ఖమేనీ దళాల విజృంభణ
అసహనంతో జనావాసాలపై దాడి చేస్తున్న ఇజ్రాయిల్-అమెరికా
‘సరదా’ కోసం ఖర్గ్‌పై మరిన్ని దాడులు : ట్రంప్ తెంపరితనం
(నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్)
మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దాడులు, ప్రతి దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. అమెరికా, ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌లోని సెంట్రల్ ఇస్ఫహాన్ రాష్ట్రంపై క్షిపణి దాడులు జరిపాయి. ఫ్యాక్టరీలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగిన దాడులలో కనీసం పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు. వైమానిక దాడుల తర్వాత ఇస్ఫహాన్ నగరంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అటు ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పైన, ఇరాన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాల పైన దాడులు జరిపింది. ఇత 24 గంటల కాలంలో ఇరాన్ జరిపిన దాడులలో 108 మంది గాయపడ్డారని ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్ వైపు నుంచి దూసుకొస్తున్న క్షిపణులను నియంత్రించటం ఇజ్రాయిల్ బలగాలు కష్టంగా మారుతోంది.
దక్షిణ ప్రాంతం వైపు వచ్చి పడుతున్న క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలు ప్రయత్నించాయి. కానీ వైఫల్యం చెందుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరాన్ దాడులలో మూడు వేల మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను రియాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో అడ్డుకున్నామని సౌదీ అరేబియా తెలియజేసింది.
గత నెల 28 నుంచి సౌదీలోని ఇంధన మౌలిక సదుపాయాలు, అమెరికా ఆస్తులు, సైనిక స్థావరాలు, పట్టణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. యూఏఈలో అమెరికాకు చెందిన అల్-ధఫ్రా వైమానికి స్థావరంపై ఇరాన్ పది క్షిపణులను ప్రయోగించింది. యూఏఈలోని ఫుజైరా ఓడరేవు వద్ద దట్టమైన పొగలు వ్యాపించాయి. ఒక్క యూఏఈ పైనే 33 డ్రోన్లు, తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. కువైట్ గగనతలంలోకి ఏడు ఇరాన్ క్షిపణులు ప్రవేశించాయి. వీటిలో రెండు క్షిపణులు అహ్మద్ అల్-జబర్ వైమానిక స్థావరాన్ని తాకాయి. అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి జరగడంతో అక్కడి రాడార్ దెబ్బతింది. ఖతార్‌పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి.
దెబ్బతిన్న ఇరాన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం
పలు నగరాలపై ఇరాన్ ముమ్మరంగా దాడి చేస్తుండడంతో ఇజ్రాయిల్ అసహనానికి గురవుతోంది. జనావాసాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్, అమెరికా దాడులలో పశ్చిమ టెహ్రాన్‌లోని ఇరాన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం దెబ్బతిన్నది. ఇరాన్‌లోని ఫార్స్ రాష్ట్ర రాజధాని షరాజ్‌లో జనావాస ప్రాంతాలపై దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయిల్ సేనల దాడిలో ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న సిడాన్ నగరంలో నివాస భవనంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు.
‘సరదా’ కోసం ఖర్గ్‌పై మళ్లీ దాడి : ట్రంప్
బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ లోపల ఉన్న హెలిపాడ ్‌పై క్షిపణి దాడి జరగడం, ఫుజైరాలోని చమురు స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిని అడ్డుకునేక్రమంలో శిధిలాలు ఆ స్థావ రంపై పడడంవంటి ఘటనల నేపథ్యంలో గల్ఫ్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలు, నౌకామార్గాల భద్రతపై ఆందోళ నలు పెరుగుతున్నాయి. ఇరాన్‌లోని ఖర్గ్ దీవిపై మరోసారి దాడిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చ రించారు. ఆ దీవి ఇప్పటికే చాలావరకూ ధ్వంస మైందని, అయినప్పటికీ ‘సరదా కోసం’ మరికొన్ని సార్లు దానిపై దాడి చేస్తామని చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలకు ఇరాన్ సంసిద్ధంగానే ఉన్నప్పటికీ దాని షరతులు తమకు అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశారు. కాగా ఖర్గ్ దీవిపై మరిన్ని దాడులు జరిపినా, హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ప్రయత్నించి నా ఘర్షణలు మరింత ముదిరి అంతర్జాతీయ చమురు మార్కెట్లకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరించారు.
నెతన్యాహూ సేఫ్ : ఇజ్రాయిల్
ఇరాన్ దాడుల్లో తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలపై ఇజ్రాయిల్ స్పందించింది. అవి తప్పుడు వార్తలని, ప్రధాని క్షేమంగానే ఉన్నారని నెతన్యాహూ కార్యాలయం తెలిపింది. నెతన్యాహూ తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నెతన్యాహూ కుడి చేతికి ఆరు వేళ్లు కనిపించాయని, అది ఏఐ సాయంతో తీసిన వీడియోలా కన్పిస్తోందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాన్ దాడిలో నెతన్యాహూ చనిపోయారంటూ వార్తలు అందించాయి. అయితే ఈ వార్తలను నెతన్యాహూ కార్యాలయం తోసిపుచ్చుతూ ఆయన సురక్షితంగానే ఉన్నారని తెలిపింది.
మొజ్తాబా చనిపోయారేమో : ట్రంప్
ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సందేహాన్ని లేవనెత్తారు. మొజ్తాబా జీవించి ఉన్నారని చెప్పడానికి తన వద్ద ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని ఆయన అన్నారు. సుప్రీం నేతగా ఎన్నికైన తర్వాత మొజ్తాబా తొలి సందేశం లిఖితపూర్వకంగానే ఉంది తప్ప ఆయన ప్రజల ముందుకు రాలేదని గుర్తుచేశారు. మొజ్తాబా సజీవంగా ఉన్నారని తాను అనుకోవడం లేదని, ఆయనను ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదని చెప్పారు.
ఒకవేళ మొజ్తాబా జీవించి ఉంటే తన దేశం కోసం లొంగిపోయి ఉండేవారని ట్రంప్ అన్నారు. చర్చలకు ఇరాన్ సిద్ధంగానే ఉన్నప్పటికీ దాని షరతులు సరిగా లేవని తెలిపారు. కాగా మధ్యప్రాచ్యంలోని మిత్ర దేశాలు చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు ట్రంప్ ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. యుద్ధం నాలుగైదు వారాల పాటు జరగవచ్చునని తొలుత ట్రంప్ అంచనా వేశారు. అయితే మరింత సమయం పట్టవచ్చునని తాజాగా ఆయన అంచనాకు వచ్చారు. ఇరాన్‌లో ఏ లక్ష్యాన్ని మిగల్చకూడదని ఆయన భావిస్తున్నారు.
ఆ రెండు దేశాల నౌకల పైనే నిషేధం : ఇరాన్
హర్మూజ్ జలసంధిని అమెరికా, ఇజ్రాయిల్ నౌకలకు మాత్రమే మూసివేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వివరణ ఇచ్చారు. నిజం చెప్పాలంటే జలసంధి తెరిచే ఉన్నదని ఆయన చెప్పారు. తమ పైన, మిత్ర దేశాల పైన దాడులు చేస్తున్న శత్రువుల నౌకలు, ట్యాంకర్లు తిరగకుండా మాత్రమే దానిని మూసివేశామని తెలిపారు. ఇతర దేశాల నౌకలన్నీ స్వేచ్ఛగా ప్రయాణించవచ్చునని అన్నారు. రష్యా, చైనాలు మీకు సైనిక, ఇంటెలిజెన్స్ మద్దతు ఇస్తున్నాయా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అరాగ్చీ జవాబిస్తూ ఆ దేశాలు తమకు వ్యూహాత్మక భాగస్వాములని, గతంలో వాటితో తమకు సన్నిహిత సహకారం ఉన్నదని, ఇక ముందు కూడా అది కొనసాగుతుందని, సైనిక సహకారం కూడా అందులో భాగమేనని వివరించారు.
ఇరాన్ యుద్ధంలో హౌతీలు ?
మరో జలసంధి మీదుగా రవాణాకు గండం
ఇరాన్ యుద్ధంలో యెమన్‌కు చెందిన హౌతీలు కూడా భాగస్వాములు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే హర్మూజ్‌లో జరుగుతున్న విధంగానే బాబ్ ఎల్-మందేబ్ జలసంధిలో కూడా నౌకల రాకపోకలకు ఆంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ హౌతీలు యుద్ధానికి దూరంగా ఉన్నారు. అయితే తమ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు పంపారు. అవసరమైనప్పుడు తక్షణమే రంగంలోకి దిగుతామని తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న ‘మూడు దశల వ్యూహం’లో హౌతీలు భాగంగా ఉన్నారని నిపుణులు అంటున్నారు. హౌతీలు అప్రమత్తంగానే ఉన్నారని, యుద్ధంలో వారు ఇరాన్‌తో జత కలవవచ్చునని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
హౌతీలు యుద్ధంలో చేరితే బాబ్ ఎల్-మందేబ్ జలసంధి మూతపడుతుందని చెప్పింది. అరేబియన్ ద్వీపకల్పం దక్షిణ కొనలో ఉన్న ఈ ఇరుకైన మార్గం ఎర్ర సముద్రం మీదుగా సూయజ్ కాలువలోకి నౌకల ప్రయాణానికి వీలు కల్పిస్తోంది. హర్మూజ్ మాదిరిగానే ఇది కూడా కీలకమైన జలసంధే. ఇది ఎర్ర సముద్రాన్ని, హిందూ మహా సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో, ఆ తర్వాత అట్లాంటిక్ మహా సముద్రంతో అనుసంధానిస్తోంది. ఆసియా-యూరప్ వాణిజ్యానికి ఇది ఎంతో కీలకమైనది. హౌతీలు ఈ జలసంధి ద్వారా నౌకల రవాణాను అడ్డుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.



