జనావాసాల నుంచి ఫార్మా, డ్రగ్ కంపెనీల తరలింపుపై కసరత్తు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పీసీబీ సమీక్షలో మంత్రి కొండా సురేఖ
ఫిర్యాదుల విషయంలో అధికారులపై మంత్రి ఆగ్రహం!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ పరిరక్షణను ఉల్లంఘించే ఫార్మా, డ్రగ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, ప్రభుత్వం తరఫున టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఆ కమిటీలో ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, రెవెన్యూ అధికారులు, పర్యావరణ పరిరక్షకులు, సెంట్రల్ పీసీబీ అధికారులు ఉంటారని తెలిపారు. జనావాసాలున్న చోట నుంచి ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీల తరలింపుపై కసరత్తు చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఔటర్ రింగు రోడ్డు అవతలే ఫార్మా కంపెనీలుండాలని చెప్పారనీ, ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, పీసీబీ మెంబర్ సెక్రెటరీ రవి, సీఈ రఘు, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, వెంకన్న, రవిశంకర్, పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల నుంచి వచ్చిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఉన్న కేసులు, సీపీసీబీకి అందిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూగర్భజలాలు కలుషితం కాకుండా ఉండేందుకు తాము అనుసరిస్తున్న పద్ధతులను పలు కంపెనీల ప్రతినిధులు వివరించారు. కొన్ని పరిశ్రమల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపైనా, మరికొన్ని పరిశ్రమలు కిందిస్థాయి ప్రతినిధులను పంపడంపైనా మంత్రి సురేఖ తప్పుబట్టారు. పరిశ్రమల అనుమతుల్లో ఉదాశీనత సరికాదనీ, ఎక్కడైనా ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చౌటుప్పల్ ఏరియా నుంచి పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యంపై విపరీతమైన ఫిర్యాదులు రావడమేంటని ప్రశ్నించారు. వాటిపై చాలా కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల అనుమతుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో పీసీబీ ఉన్నతాధికారుల తీరుపై మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేని, అనుమతుల టైం అయిపోయిన కంపెనీలను ఎన్నిసార్లు రైడ్స్ చేశారు? గ్రౌండ్ వాటర్ కలుషితమవుతున్న స్టేటస్ తీరును ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారా? లేదా? గ్రౌండ్ వాటర్ కలుషితమైన ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ డ్రైవ్ చేపించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతటి వారైనా పర్యావరణ పరిరక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు చేస్తున్నామనీ, కంప్యూటరైజ్డ్ తనిఖీల ప్రక్రియ కూడా చేపట్టామని పీసీబీ మెంబర్ సెక్రెటరీ జి.రవి వెల్లడించారు. అనంతరం మళ్లీ మంత్రి సురేఖ మాట్లాడుతూ..నీటి కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలనీ, దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. గాలి కాలుష్య నియంత్రపైనా దృష్టి సారించాలని సూచించారు. కరోనా తర్వాత చిన్న చిన్న విషయాలకే మరణాలు సంభవిస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ మరింత కీలకమైందని చెప్పారు. సిగాచి ఘటన తర్వాత కంపెనీల్లో మరింత భద్రత అవసరమని నొక్కి చెప్పారు. కంపెనీల్లో ఏది ఎలా ఉందో యాజమాన్యాలు తరుచూ స్వీయ తనిఖీలు చేసుకోవాలనీ, పీసీబీ తరఫున కూడా ఇక నుంచి తరుచూ ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణపై టాస్క్‌ఫోర్స్ కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES