Tuesday, July 22, 2025
E-PAPER
Homeమానవిరాగుల‌తో రుచిగా…

రాగుల‌తో రుచిగా…

- Advertisement -

రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం బలంగా, దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. రాగులు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు రాగి పిండితో చేసిన వంటకాలు తింటే చాలా మంచిది. మరి రాగిపిండితో చేసే రుచికరమైన కొన్ని వంటకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం…
మురుకులు
ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యపు పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా వాము తీసుకొని అందులో నీరు పోసి గట్టిగా ముద్దగా చేసుకోవాలి. ఆ తర్వాత రాగి పిండి ముద్దను మురుకులు చేసే మెషిన్‌లో వేయాలి. మురుకులను సన్నగా ఒత్తుకొని వేడి వేడి నూనెలో వేయించాలి. అంతే కరకరలాడే రాగి పిండి మురుకులు సిద్ధం అవుతాయి. వీటిని తినేందుకు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా రుచికరంగా కూడా ఉంటాయి. దీంతోపాటు ఇందులో అనేక పోషకాలు కూడా లభిస్తాయి.
లడ్డూ
రాగి పిండితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ముందుగా రాగులను వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని పొడి పట్టాలి. ఇప్పుడు తాజా రాగి పిండి సిద్ధం అవుతుంది. ఈ రాగి పిండిలో ఒక కప్పు బెల్లం పొడి, ఒక కప్పు కొబ్బరి పొడి, ఒక కప్పు పుట్నాల పొడి కలిపి లడ్డూలుగా ఒత్తుకునేందుకు నెయ్యి కలపాలి. అలాగే ఈ పొడిలో కరిగించిన బెల్లం పానకం కలిపి లడ్డూలుగా ఒత్తుకోవాలి. అంతే రాగి పిండి లడ్డూ సిద్ధం అవుతుంది.
గారెలు
ముందుగా ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు రాగులు నీళ్లలో నానబెట్టి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తురిమిన ఉల్లిగడ్డ ముక్కలు, సన్నగా తురిమిన పచ్చిమిర్చి తరుగు, సన్నగా తురిమిన అల్లం వెల్లుల్లి తరుగు వేసుకొని ఇప్పుడు రాగి పిండితో గారెలు వేసుకోవాలి. మంచి రుచికరమైనటు వంటి పోషకాలతో నిండిన రాగి పిండి గారెలు సిద్ధం అవుతాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
పప్పు చెక్కలు
ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యప్పిండి కలిపి వాటిలో నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిని నీటిని ఇందులో పోసుకోవాలి. మెత్తగా పిండిలా మారినటువంటి మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీల లాగా ఒత్తుకొని నూనెలో వేయించాలి. ఇప్పుడు కారపు పప్పు చెక్కలు సిద్ధం అవుతాయి. రాగి పిండితో చేసిన ఈ పప్పు చెక్కలు తింటే శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందిస్తాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
బూరెలు
రాగులు, మినప్పప్పు సమపాళ్లల్లో రెండింటిని నీటిలో నానబెట్టి ఆ తర్వాత వీటిని పిండిగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత రాగి పిండి మిశ్రమం తయారు అవుతుంది. ఇప్పుడు ఒక బాణళిలో ఉడికించిన శనగపప్పు, బెల్లం, యాలకుల మిశ్రమం తీసుకోవాలి. వీటిని ముద్దగా రుబ్బుకోవాలి. ఇఫ్పుడు శనగపప్పు, బెల్లం మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఈ లడ్డూలను రాగిపిండి మిశ్రమంలో ముంచి బూరెలుగా వేసుకోవాలి.
కిచిడి
ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్‌ను సన్నని ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన ఉంచాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులోకి సగ్గుబియ్యం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్‌, టమాటా, అల్లం వెల్లుల్లి తరుగు, పసుపు, మిరియాలు వేసి ఓసారి కలపాలి. ఆ తర్వాత కూరగాయ ముక్కలు మునిగేంతవరకు నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో రెండు విజిల్స్‌ వచ్చే వరకు కుక్‌ చేసుకోవాలి. కుక్కర్‌ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి స్మాషర్‌ సాయంతో మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసి సిమ్‌లో పెట్టి రాగిపిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగిపిండిని పప్పు మిశ్రమంలో పూర్తిగా కలిసేలా కలుపుకున్న తర్వాత సుమారు పది నిమిషాల పాటు కుక్‌ చేసుకోవాలి. ఈలోపు స్టవ్‌ ఆన్‌ చేసి పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. కాగిన నెయ్యిలో జీడిపప్పు పలుకులు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. జీడిపప్పు వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. రాగి పిండి ఉడికిన తర్వాత ఈ తాలింపు వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరో సారి కలపాలి. దీన్ని వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
తోప
స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి రెండు కప్పుల నీరు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పు కొలతతో నీరు తీసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల బెల్లం నీళ్లలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి. బెల్లం కరిగించిన కడాయినే కడిగి నెయ్యి వేసి కరిగించుకోవాలి. అందులో రాగిపిండి వేసి లో ఫ్లేమ్‌లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. రాగి పిండి మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. రాగి, కొబ్బరి మగ్గిన తర్వాత కరిగించిన బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిలో కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి మిశ్రమం ఉడికి, నెయ్యి పైకి తేలి గిన్నెకు అంటుకోకుండా ఉన్నప్పుడు మరికొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, బలమైన రాగి తోప రెడీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -