Tuesday, October 28, 2025
E-PAPER
Homeమానవిబ్రెడ్‌తో టేస్టీగా..

బ్రెడ్‌తో టేస్టీగా..

- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి మార్నింగ్‌ టిఫెన్స్‌ రెడీ చేసుకోవడానికి తగినంత సమయం ఉండదు. ఇక పిల్లలైతే ఎప్పుడూ వెరైటీ కావాలని గోల చేస్తుంటారు. దాంతో ఎక్కువ మంది బ్రెడ్‌తో చేసుకునే వాటికి ఇంపార్టెన్స్‌ ఇస్తుంటారు. అంటే త్వరగా అయిపోతాయని బ్రెడ్‌ ఆమ్లెట్‌, బ్రెడ్‌ ఉప్మా వంటివి చేసుకుంటుంటారు. అవి మాత్రమే కాకుండా బ్రెడ్‌తో రకరకాల టిఫెన్లు, స్నాక్స్‌ చేసుకోవచ్చు. అంవేంటో ఈరోజు తెలుసుకుందాం…

మసాలా బ్రెడ్‌ టోస్ట్‌

కావాల్సిన పదార్థాలు: ఆరు – బ్రెడ్‌ స్లైసులు, మూడు – ఆలూ, అరకప్పు – సన్నని ఉల్లిగడ్డ ముక్కలు, రెండు టేబుల్‌ స్పూన్లు – సన్నని క్యాప్సికం తరుగు, రెండు టేబుల్‌ స్పూన్లు – క్యారెట్‌ తురుము, చెంచా – పచ్చిమిర్చి తరుగు, పావు చెంచా – పసుపు, చెంచా – ఎండుమిర్చి గింజలు, అర చెంచా – అల్లం పేస్ట్‌, రుచికి తగినంత – ఉప్పు, చెంచా – ధనియాలపొడి, అరచెంచా – మిరియాలపొడి, రెండు టేబుల్‌ స్పూన్లు – సన్నని కొత్తిమీర తరుగు, పావు కప్పు – బటర్‌(వెన్న) పావు కప్పు – పాలు
తయారీ విధానం: ముందుగా ఆలూ మసాలా స్టఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్‌ మీద ఒక గిన్నెలో ఆలూను తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు సన్నని ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, క్యాప్సికం తరుగు, క్యారెట్‌ తురుమును రెడీ చేసుకుని పక్కనుంచాలి. అలాగే కొత్తిమీరను సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆలూ మంచిగా ఉడికాక పొట్టు తీసి మెత్తగా మాష్‌ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లిగడ్డ, క్యాప్సికం ముక్కలు, సన్నని పచ్చిమిర్చి తరుగు, క్యారెట్‌ తురుము, పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఎండుమిర్చి గింజలు వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్‌, మిరియాలపొడి, ధనియాలపొడి, సన్నని కొత్తిమీర తరుగు వేసి అన్నింటినీ బాగా ప్రెస్‌ చేస్తూ కలిపితే స్టఫింగ్‌ రెడీ అవుతుంది! ఇప్పుడు ఒక బ్రెడ్‌స్లైసును తీసుకుని దానిపైన కాసిని పాలు రాసి ముందుగా రెడీ చేసుకున్న ఆలూ మసాలాను స్లైసు మొత్తం చక్కగా పరవాలి. స్టవ్‌ మీద దోశ పెనం పెట్టి కొద్దిగా బటర్‌ వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక బ్రెడ్‌ స్లైసును మసాలా పరిచిన వైపు పాన్‌పై కాలే సైడ్‌ ఉంచి రెండో వైపు ఇంకొద్దిగా బటర్‌ అప్లై చేసుకోవాలి. మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి చక్కగా కాల్చుకుని సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఆలూ స్టఫింగ్‌తో సూపర్‌ టేస్టీగా ఉండే ‘మసాలా బ్రెడ్‌ టోస్ట్‌’ రెడీ.

బ్రెడ్‌ వడలు
కావాల్సిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైస్‌లు – ఆరు, బొంబాయి రవ్వ – పావు కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, ఉల్లిగడ్డ – ఒకటి, అల్లంముక్క – చిన్నది, పచ్చిమిర్చి- రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్‌ చేసుకోవాలి. అల్లంపై పొట్టు తీసేసి వీలైనంత మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అలాగే బ్రెడ్‌ స్లైస్‌లను సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. మిక్సింగ్‌ బౌల్‌లోకి కట్‌ చేసిన బ్రెడ్‌ ముక్కలు వేసుకోవాలి. అందులోకి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉల్లిగడ్డ తరుగు, అల్లం పేస్ట్‌, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని ముద్దలా కలుపుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను ప్రెస్‌ చేస్తూ కలుపుకోవడం వల్ల మిశ్రమం మొత్తం సాఫ్ట్‌గా, ముద్దలాగా వస్తుంది. తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు చేతికి కాస్త నూనె రాసి పిండిని కొద్దిగా తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత అరచేతిలో సమానంగా వత్తుకుని మధ్యలో హోల్‌ పెట్టి ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని వడల షేప్‌లో వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటను కాస్త తగ్గించి తయారు చేసుకున్న వడలను నూనెలో వేసుకోవాలి. కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత గరిటెతో వెంటనే తిప్పకుండా ఓ రెండు నిమిషాలు అలానే వేగనిచ్చి, అప్పుడు నిధానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా వేగి క్రిస్పీగా మారిన తర్వాత టిష్యూ పేపర్‌ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా ఆయిల్‌లో వేసి వేయించుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని నచ్చిన చట్నీతో సర్వ్‌ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్‌ వడలు రెడీ.

బ్రెడ్‌ పకోడీ
కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు – రెండు, పచ్చిమిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, ఉప్పు – సరిపడా, కారం – తగినంత, పసుపు – పావు టీస్పూను, ధనియాల పొడి – టీస్పూను, జీలకర్ర టీస్పూను, బియ్యప్పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు, శనగ పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా – పావు టీస్పూను, బ్రెడ్‌ స్లైస్‌లు – నాలుగు.
తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డలను సన్నగా, పొడుగ్గా కట్‌ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన ఉంచాలి. మిక్సింగ్‌ బౌల్‌లోకి తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసి పదార్థాలు మొత్తం బాగా కలపాలి. తర్వాత బియ్యప్పిండి, శనగపిండి వేసి మరోసారి కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ మరీ గట్టిగా, మరీ మందంగా కాకుండా పిండిని కలపాలి. ఆ పిండిని పక్కన పెట్టి బ్రెడ్‌ స్లైస్‌లకు నాలుగు వైపులా గోధుమరంగులో ఉండే పార్ట్‌ను కట్‌ చేసి చిన్న చిన్న ముక్కలుగా అంటే స్క్వేర్‌ లేదా ట్రైయాంగిల్‌ షేప్‌లో కట్‌ చేసుకోవాలి. కట్‌ చేసుకున్న బ్రెడ్‌ ముక్కలను ఒక్కొక్కటి తీసుకుని కలిపి పెట్టిన పిండిలో వేసి రెండు వైపులా కోట్‌ చేసుకుని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన బ్రెడ్‌ ముక్కలను కూడా శనగపిండి మిశ్రమంలో డిప్‌ చేసి కోట్‌ చేసుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్‌ హీటెక్కిన తర్వాత కోట్‌ చేసిన బ్రెడ్‌ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి వెంటనే కదపకుండా రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత చిల్లుల గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి.

ఎగ్‌ బ్రెడ్‌ బజ్జీ
కావాల్సిన పదార్థాలు: శనగపిండి – కప్పు, బియ్యప్పిండి – టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూను, నీరు – సరిపడా, వంట సోడా – చిటికెడు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, బ్రెడ్‌ స్లైస్‌లు – ఎనిమిది, ఉడకబెట్టిన కోడిగుడ్లు – నాలుగు, నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ – కప్పు, పచ్చిమిర్చి – రెండు, తురిమిన క్యాప్సికం ముక్కలు – పావుకప్పు, ధనియాల పొడి- అర టీ స్పూను, కారం – అర టీ స్పూను, వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూను, గరం మసాలా – పావు టీ స్పూను, టమాట సాస్‌ – ఒకటిన్నర టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: స్టౌ మీద పాన్‌ పెట్టి నాలుగు టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని ఉల్లిగడ్డ ముక్కలు వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. ఉల్లిగడ్డ రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోకి వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా నాలుగు టేబుల్‌ స్పూన్ల నీరు పోసి ఉల్లిగడ్డ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు, టమాట సాస్‌ వేసుకుని బాగా కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిల్క్‌ బ్రెడ్‌ లేదా శాండ్‌విచ్‌ బ్రెడ్‌ స్లైస్‌లు తీసుకుని నాలుగు వైపులా వాటి సైడ్స్‌ కట్‌ చేసుకోవాలి. ఓ బ్రెడ్‌ స్లైస్‌ తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని బ్రెడ్‌ మధ్యలో పెట్టి కొద్దిగా స్ప్రెడ్‌ చేసుకోవాలి. దాని మీద సగం కట్‌ చేసిన కోడిగుడ్డును పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రైడ్‌ స్లైస్‌ అంచులను నీటితో కొద్దిగా తడపాలి. ఇప్పుడు అంచులు తడుపుకున్న బ్రెడ్‌ స్లైస్‌ను ఎగ్‌ మిశ్రమం పెట్టుకున్న బ్రెడ్‌ స్లైస్‌ మీద పెట్టి అంటించాలి. ఓ గిన్నె తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, సోడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే సన్నని కొత్తిమీర తరుగు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. శనగపిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి. లేదంటే తినేటప్పుడు పిండి నోటికి అంటుకపోతుంది. ఇప్పుడు స్టౌమీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్‌ చేసుకున్న బ్రెడ్‌ను శనగపిండిలో రెండు వైపులా బాగా డిప్‌ చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా తిప్పి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్‌ ముక్కలను వేయించుకోవాలి. ఇప్పుడు నూనెలో నుంచి తీసిన బ్రెడ్‌ను సగానికి కట్‌ చేసుని సాస్‌ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -