Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం41.50 కి.మీ మేర టాటా

41.50 కి.మీ మేర టాటా

- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు
రావిర్యాల్‌ నుంచి అమనగల్‌ వరకు
ప్రాంతీయ అనుసంధానమే లక్ష్యం
నేడు సీఎం శంకుస్థాపన


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకుగాను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వద్ద రావిర్యాల్‌ (టాటా ఇంటర్‌చేంజ్‌) నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అమనగల్‌ (రతన్‌ టాటా రోడ్‌) వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌-1 నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ మేరు రోడ్లు, భవనాల శాఖ చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. త్వరలో ఈప్రాజెక్టు పట్టాలెక్కనుంది. దాదాపు 41.50 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును చేపట్టనున్నారు. రెండు దశల్లో ఈ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

దశలవారీగా
ఒకటో దశలో రావిర్యాల టాటా ఇంటర్‌చేంజ్‌ (ఓఆర్‌ఆర్‌) నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వరకు సుమారు 19.20 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే రెండో మీర్‌ఖాన్‌పేట్‌ నుంచి అమనగల్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) వరకు 22.30 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ప్రత్యేక మెట్రో, రైల్వే కారిడార్‌, గ్రీన్‌బెల్ట్స్‌, సైకిల్‌ ట్రాక్స్‌, ఫుట్‌పాత్‌లు ,సర్వీస్‌ రోడ్లు అందుబాటులోకి వస్తున్నాయి.

14 గ్రామాల గుండా…
రెండు దశల్లో కలిపి 14 గ్రామాల గుండా రేడియల్‌ రోడ్డు వెళ్లనుంది. మొదటి దశలో రంగారెడ్డి జిల్లా కొంగర ఖుర్ద్‌, ఫీరోజ్‌గూడ, కొంగర కళాన్‌, లేమూర్‌, తిమ్మాపూర్‌, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట్‌ గ్రామాలు గుండా వెళ్లనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కండకూరు మండలాలు ఉన్నాయి. రెండో దశలో కుర్మిద్ద, కడ్తాల్‌, ముద్విన్‌, ఆకుతోటపల్లి, అమంగల్‌ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్‌, అమంగల్‌ మండలాలు ఉన్నాయి.

ప్రాజెక్ట్‌ వ్యయం
ఒకటో దశలో భూసేకరణతో సహా రూ.1,911 కోట్లు, రెండో దశలో భూసేకరణతో సహా రూ.2,710 కోట్లు ఖర్చవనుంది. మొత్తం ప్రాజెక్ట్‌ ఖర్చు:రూ.4,621 కోట్లు వ్యయం కానుంది.

ప్రస్తుత స్థితి
మొదటి, రెండో దశలు విడిగా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ద్వారా టెండర్లు పిలిచారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది. సుమారు 8.94 కి.మీ. రహదారి 236.89 ఎకరాల్లో ఏడు రిజర్వ్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల గుండా వెళ్తుంది. వీటికి సంబంధించిన అనుమతులు పరివేష్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసి పరిశీలనలో ఉన్నాయి. దాదాపు 310 ఎకరాల టీజీఐఐసీ భూమి 7.69 కి.మీ. రహదారి పొడవు, ఒకటి, రెండో దశ ఇంటర్‌చేంజ్‌లతో కలిపి వెళ్తుంది.

ప్రాజెక్ట్‌ ప్రయోజనాలు
సులభ అనుసంధానం: ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ను నేరుగా కలిపి, దక్షిణ జిల్లాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రస్తుత మార్గాలపై ట్రాఫిక్‌ రద్దీ కూడా తగ్గనుంది. భవిష్యత్తులో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మెట్రో రైలుకు సౌకర్యం ఉంటుంది.
పరిశ్రమ, లాజిస్టిక్స్‌ సౌకర్యం: పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, ఫ్యూచర్‌ సిటీ, స్కిల్‌ యూనివర్సిటీ, ఈ-సిటీ, ప్రాంతీయ మార్కెట్లకు వేగవంతమైన రవాణా అందుతుంది.
భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అనుసంధానం: రహదారి ద్వారా హైదరాబాద్‌ నుంచి రాబోయే ఫ్యూచర్‌ సిటీకి సులభ రవాణా -ఐటీ పార్కులు, పరిశోధనా కేంద్రాలు, ఆధునిక నివాస సముదాయాలకు అనుసంధానం.
స్కిల్‌ యూనివర్సిటీ అనుసంధానం: యూనివర్సిటీ, సమీప పరిశ్రమల మధ్య సులభ రవాణా – ఔషధ, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ అనుబంధ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయి.
ఆర్థికాభివృద్ధి, ఉపాధి: నిర్మాణ దశలో ఉపాధి సృష్టి, ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.
సుస్థిర రవాణా: సైకిల్‌ ట్రాక్స్‌, గ్రీన్‌బెల్ట్స్‌, ఫుట్‌పాత్‌లు, భవిష్యత్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు సౌకర్యం – పర్యావరణహిత రవాణా ఎక్కువ కానుంది.
ఈ-సిటీ లింక్‌: సెమీకండక్టర్‌, హార్డ్‌వేర్‌ ఉత్పత్తి పరిశ్రమలకు సులభ రవాణా, ఎగుమతులకు ప్రోత్సాహం లభించనుంది. ”మేక్‌ ఇన్‌ తెలంగాణ” లక్ష్యానికి బలాన్నిస్తుందని సర్కారు భావిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. పర్యావరణహిత, సుస్థిర మౌలిక వసతులను అందించడం ద్వారా ప్రాంతీయ రవాణా అవసరాలను తీర్చడానికి కృషి చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -