ఉపాధ్యాయులంటే స్కూల్‌కు వెళ్లడం, పిల్లలకు పాఠాలు చెప్పడం వరికే వారి బాధ్యత. అలా తమకు తాము పరిమితులు పెట్టుకొని వృత్తిని కొనసాగించేవారు ఎందరో ఉంటారు. కానీ పిల్లలకు ఆసక్తిగా పాఠాలు చెప్పడంతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేసే ఉపాధ్యాయులూ కొందరు ఉంటారు. అలాంటి వారిలో సాధన టీచర్ ఒకరు. ‘సారంగదరియా టీచర్’గా ఎందరికో పరిచయమయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ గుండెల్లోనే దాచుకొని, చెదరని చిరునవ్వుతో విద్యార్థులకు ఆట పాటలతో పాఠాలు చెబుతున్న ఆ ఉపాధ్యాయిని పరిచయం నేటి మానవిలో…
ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, మాధాపురం గ్రామ ముద్దు బిడ్డ సాధన తేరాల. తల్లి విజయ, తండ్రి వెంకటేశ్వర్లు. తండ్రి గ్రామంలో ఇరవై ఐదేండ్లపాటు నవోదయ పేరుతో ఓ పాఠశాలను నడిపారు. తల్లి గృహిణి. సాధనకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఆమె తన విద్యాభ్యాసం మొదట తండ్రి నడిపే పాఠశాలలోనే ప్రారంభించారు. తర్వాత మాధాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు. ఇంటర్మీడియట్, టీటీసీ, డిగ్రీ ఖమ్మంలో పూర్తి చేసి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏం.ఏ ఇంగ్లీష్ చేసారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ధూంధాం కార్యక్రమాల్లో ఆడి-పాడి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఉపాధ్యాయినిగా…
2012 మే నెలలో డి.ఎడ్. పట్టా అందుకున్న సాధన ఓ చిన్న ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యి కేంద్రియ విద్యాలయ, ఖమ్మంలో రెండేండ్లు సేవలందించారు. తర్వాత హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ పాఠశాలలో విధులు నిర్వహించి కరోనా ప్రభావంతో సొంత ఊరు చేరుకున్నారు. ఊళ్లో 20 మంది పిల్లలకు నవోదయ, గురుకుల కోచింగ్ ఇచ్చారు. వారిలో ఇద్దరికి నవోదయ, మిగతా 18 మందికి గురుకులాల్లో సీట్లు లభించాయి. అప్పుడు ఈ విద్యార్థుల కళ్లలో వెలకట్టలేని సంతోషాన్ని చూశారు.
వినూత్న ప్రయత్నంతో…
కొంత కాలానికి ఖమ్మంలోని క్రియేటివ్ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా చేరారు. కరోనా ప్రభావంతో అన్నీ మర్చిపోయిన విద్యార్థులకు వివిధ రకాల పద్ధతుల్లో బోధన ప్రారంభించారు. ఈ వినూత్న ప్రయత్నంతోనే సాధన టీచర్ ఇప్పుడు ఎందరికో పరిచయం అయ్యారు. ‘నో బ్యాగ్ డే’ రోజున ‘దాని కుడీ భుజం మీద కడువ’ పాటను ‘తన ఎడం భుజం మీద నేపాల్, దానిపైనే ఉంది చైనా.. తన కుడిభుజం మీద పాకిస్థాన్, ఆ పైనే ఉంది ఆఫ్ఘనిస్తాన్…’ అంటూ సారంగదరియా స్టైల్‌లో భారతదేశ పటాన్ని విద్యార్థులకు చక్కగా పరిచయం చేశారు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారమైంది. అంతే కాదు అప్పటి నుండి సాధనా టీచర్ మరెందరో ఉపాధ్యాయులకు ఆదర్శంగా మారారు.
నాటక రచయితగా
సాధనకు చిన్నప్పటి నుండే పాడడం, ఆడడం, నృత్యాలు చేయడం, బొమ్మలు గీయడం, పోటీ పరీక్షలు రాయడం, వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం చాలా ఇష్టం. అన్నిట్లో పాల్గొనడమే కాకుండా అనేక బహుమతులు కూడా పొందారు. ఆమె టెన్నికాయట్ జోనల్ క్రీడాకారిణి. అంతేకాదు ఖమ్మం జిల్లాకి మొట్టమొదటి గైడ్ గర్ల్(ఎన్‌సీసీ) కూడా. 8వ తరగతిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలిగా పనిచేశారు. 9వ తరగతిలోనే జెడ్‌పీఎస్‌ఎస్ మాధాపురం పాఠశాల వార్షికోత్సవం కోసం ‘అయోమయం డాక్టర్’ నాటకం రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుండి చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా 2016లో సాఫ్ట్వేర్ వీరుడు- వాట్సాప్ సుందరి నాటకం రాశారు. అలాగే 2022-23లో స్వచ్ఛ భారత్ సోదెమ్మ (మహిళా రుతు ఆరోగ్యం) లఘు చిత్రం రచించారు. ఇది జాతీయ స్థాయి పోటీలో 10వ స్థానంలో నిలిచింది.
కవయిత్రిగా…
ఎనిమిదవ తరగతి నుండే కవిత్వం రాస్తున్న ఆమె అమ్మంటే, నాన్నే నా ధైర్యం, నామవాచకాలతో నారీమణి, ప్రస్తుతం నేర్పాల్పిన విద్య, ఒక్కసారి ఆలోచిద్దాం, మన మాతృభాష-మన తెలుగు భాష, మహిళా నీకో దినోత్సవం, ఎవడో వాడు..?, నా యాదిలో దాశరథి, కేవలం గురువులం, ఉక్కు మనిషిపై నా వ్యాసం, నీవు ఎలా ఉండాలో తెలుసా?, నాదోలోకం, మహిళ.. ఓ మహిళ, వదిలేరు..! అందరి రామ, ఏమని చెప్పను..?, ఎక్కడున్నది మా’నవ’త్వం, ఉదయించే ఉషస్సులా.., నేటికీ మారని భావిభారతం.. తెలుగుభాష మనదిరా (గేయం) వంటి పుస్తకాలు రచించారు. ఇవి కాకుండా 100కి పైగా రచనలు చేసారు. ఈ మధ్యనే తెలంగాణా యాసలో రాసిన ఓ అమ్మో!, నాయిన మస్తు యాదికొత్తనవే..! కవితలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
బిరుదులు, పురస్కారాలు
ప్రముఖ పత్రికలు, సోషల్ మీడియా సాధనకు సారంగదరియా టీచర్‌గా బిరుదునిచ్చాయి. నీతి ఆయోగ్ వారు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రదానం చేశారు. ఆసియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారిచే ఇన్నోవేటివ్ టీచర్ ఆఫ్ ది ఇయర్ – 2023 అవార్డు పొందారు. 2023 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. తహెల్కా ఛానెల్, మహిళా దర్బార్, గాంధీ గ్లోబల్ సాహితీ సంస్థ, తెలుగు సబ్జెక్ట్ ఫోరం వారిచే నారీశక్తి అవార్డ్-2024 పొందారు. ఓ టీవీ ఛానల్ ఈమెపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది.
పాటలతో పాఠాలు…
సినిమా పాటలను పేరడీ పాటలుగా రాసి, విద్యార్థులకు పాఠాలను పాటలతో చెప్పడం సాధనా టీచర్‌కు అలవాటు. ఈ ఆటపాటలతోనే వారిని పరీక్షలకు సిద్ధం చేస్తే, ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంచక్కా ఫస్ట్ మార్కులతో పాస్ అయిపోతారని ఆమె నమ్మకం. ఇది ఆచరణలో కూడా నిజమయ్యింది. సారంగదరియా పాటనే దీనికి చక్కని ఉదాహరణ. కోటి మంది ఈ వీడియోను లైక్ చేశారు, రెండు లక్షలమందికి పైగా ఆమెను ప్రశంసిస్తూ కామెంట్‌లు రాశారు. అప్పటి నుండి ఎన్నో పాఠాలకు పేరడీ, స్పూఫ్లు, స్కిట్స్ రాసి, పాఠాలుగా చెబుతూ, పాఠశాల విద్యార్థుల హాజరు, మార్కుల శాతం పెంచుతున్నారు.
రక్తదాతగా…
ఈ టీచర్‌కు కేవలం విద్యార్థులతోనే కాదు జిల్లాలోని బ్లడ్ బ్యాంకులతో సత్సంబంధాలు ఉన్నాయి. తన తమ్ముడు, అతని స్నేహితులు, తన స్నేహితులతో కలిసి రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానం చేస్తున్నారు. ఎవరికైనా రక్తం అవరమని ఆమెకు తెలియగానే నిముషాలలో ఆ గ్రూప్ రక్తం వున్న వారిని తీసుకుపోయి రక్తదానం అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని అత్యవసరంలో ఆదుకుంటున్న ఈ టీచర్ ఈతరం ఉపాధ్యాయులకు, మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బూర్గు గోపికృష్ణ,
డీవీఎం కాలేజ్ ఎంఈడి విద్యార్థి