ప్రిన్సిపాల్‌ను నిలదీసిన బాధిత బాలుడి తల్లిదండ్రులు
ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పట్టించుకోని యాజమాన్యం
ఫీజుమాఫీ చేస్తామంటూ రాయబారం
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆందోళన
ఎంఈవో సమక్షంలో అగ్రిమెంట్..పాఠశాలకు మద్దతు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో బుధవారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు గురువారం పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ పాఠశాల ప్రిన్సిపల్‌కు తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థి తండ్రి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను సంప్రదించారు. వారు వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, సంగారెడ్డి ఎంఈఓ విద్యాసాగర్‌కు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న ఎంఈఓను యాజమాన్యం పాఠశాలలోకి రానివ్వలేదు. దాంతో ఎంఈఓ వెనుతిరిగి వెళ్లిపోయారు. పోలీసులు సమాచారం అందుకుని పాఠశాలకు రాగా వారిని కూడా లోపలికి రాకుండా అడ్డుకోవడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. దాంతో పోలీసులను, విద్యార్ధి నాయకులను లోపలికి అనుమతించారు.
ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోకుండా ఫీజు మాఫీ అగ్రిమెంట్..
8వ తరగతి విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయునిపై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోకుండా విద్యార్థి ఫీజుమాఫీ చేస్తామంటూ విద్యార్థి తల్లిదండ్రులతో రాయబారం నడిపింది. 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల ఫీజు చెల్లించొద్దని రూ.50 బాండ్ పేపర్‌పై యాజమాన్యం అగ్రిమెంట్ రాసిచ్చింది. అంతేకాక అందులో విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసింది వాస్తవమేనని ఒప్పుకుంటూనే మానవతా దృక్పధంతో, మంచి మనసుతో ఫీజును మాఫీ చేస్తున్నామంటూ అగ్రిమెంట్‌లో రాయడం గమనార్హం. అయితే ఉపాధ్యాయునిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో పాఠశాలకు వెళ్లిన పోలీసులు, విద్యాశాఖ అధికారులు కూడా మౌనం వహించడం చర్చనీయాంశమైంది.
ఫీజు మాఫీ అగ్రిమెంట్‌పై ఎంఈవో సాక్షి సంతకం
విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాల్సిన మండల విద్యాశాఖ అధికారి(ఎంఈఓ) విద్యాసాగర్ ఫీజు మాఫీ చేస్తామంటూ పాఠశాల యాజమాన్యం రాసిచ్చిన అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే యాజమాన్యం, విద్యార్థి తల్లిదండ్రుల మధ్య ఫీజుమాఫీ ఒప్పందం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు దాడి చేస్తే మందలించాల్సింది పోయి, యాజమాన్యానికి తొత్తుగా మారి వత్తాసు పలకడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కరుణ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి
పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని గణిత శాస్త్రం టీచర్ చితకబాదడంతో విద్యార్థికి తీవ్ర గాయాలై జ్వరం కూడా వచ్చింది. ఇంతకుముందు కూడా స్కూల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఇప్పటిదాకా ఏ ఒక్క ఘటన కూడా బయటకు రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను బెదిరిస్తున్నారు. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలి. అలాగే, పాఠశాలకు అనుకూలంగా రాసుకున్న అగ్రిమెంట్‌పై ఎంఈఓ సాక్షి సంతకం ఎలా చేస్తారు? యాజమాన్యానికి ఎంఈఓ తొత్తుగా మారారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆందోళన నిర్వహిస్తాం.
-ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్రోళ్ల మహేష్, టి.రాజేష్