రాడ్‌తో విద్యార్థులను కొట్టిన వైనం
పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థులు
వికారాబాద్ జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన
ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-వికారాబాద్
చిన్నపిల్లలని చూడకుండా విద్యార్థులను రాడుతో టీచర్ చితకబాదాడు. దాంతో తట్టుకోలేక భయానికి గురైన ఇద్దరు విద్యా ర్థులు పాఠశాల నుంచి పారిపోయారు. వికారాబాద్ శివారెడ్డిపేట్ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరవ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు బుధవారం రాత్రి డార్మెటరీలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో పీఈ టీచర్ అన్వర్ ఖాన్ వారిని రాడుతో కొట్టాడు. ఈ ఘటనలో జీవన్ అనే విద్యార్థితో పాటు మరో విద్యార్థి భయంతో గురువారం పాఠశాల నుంచి పారిపోయారు.
విద్యార్థులు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద తిరుగుతుండగా పాఠశాల నర్స్ జమున గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు తీసుకువచ్చింది. తరువాత విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కొట్టిన విషయాన్ని పక్కనబెట్టి ‘మళ్లీ పారిపోతే పాఠశాల బాధ్యత కాదు’ అని లేఖ రాయించుకున్నారు. అయితే తల్లిదండ్రులు.. పిల్లలను కొట్టిన విషయంపై ప్రశ్నించగా.. వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్, నర్స్ జమున ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డ్ జహంగీర్ సైతం తల్లిదండ్రులతో అశ్రద్ధగా మాట్లాడాడు. అయితే విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాల సిబ్బందిని నిలదీశారు. పాఠశాల సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు.
పీఈటీ అన్వర్ ఖాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అక్బర్
విద్యార్థులను రాడ్డుతో కొట్టిన పీఈటీ అన్వర్‌ఖాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి అక్బర్ డిమాండ్ చేశారు. మైనార్టీ బాలుర పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం సందర్శించి, విద్యార్థులపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్బర్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠాలు ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా మైనారిటీ గురుకులంలో ఉపాధ్యాయుల తీరు మాత్రం మారడం లేదన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, దాంతో చాలా రోజుల నుంచి విద్యార్థులు సరైన భోజనం లేక పస్తులు ఉన్నారని తెలిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. అలసత్వం ప్రదర్శించిన వార్డెన్ ఖదీర్, సెక్యూరిటీ గార్డ్ జహంగీర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తేజ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



