– ఓ ఉపాధ్యాయుడికి గాయాలు
– పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
నవతెలంగాణ-నసురుల్లాబాద్
ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతను మరిచి.. పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలో చర్చనీయాంశంగా మారింది. బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం పాఠశాలలో వ్యక్తిగత కారణాలతో విద్యార్థుల ముందే కొట్టుకున్నారు. బాధిత ఉపాధ్యాయుడు ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బొమ్మన్‌దేవ్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి కొందరు ఉపాధ్యాయులు సర్వే చేశారు. సర్వేకు సంబంధించిన ప్రత్యేక సెలవులకు సంబంధించి ప్రొసీడింగ్స్ విషయంలో గొడవ జరిగింది. సర్వే చేసిన వారికి బిల్లులు చేయకుండా, ముగ్గురికి ఎలా బిల్లు చేస్తారని నిలదీయడంతో గొడవ మొదలైంది. నంద్యాల శ్రీనివాస్(మ్యాథ్స్).. తోటి ఉపాధ్యాయుడైన రామోజీ శ్రీనివాస్ (తెలుగు)తో ఘర్షణకు దిగాడు. కోపంతో కుర్చీతో కొట్టే క్రమంలో అది విరిగి దాని ముక్క బలంగా రామోజీ శ్రీనివాస్ ముక్కు వద్ద తగలడంతో గాయాలయ్యాయి. దీనిపై బాధితుడు ఆదివారం నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం సైతం బాధితుడు స్టేషన్‌కు వెళ్లగా అక్కడికి యూనియన్ నాయకులు వచ్చి ఇరువురి మధ్య రాజీ కోసం ప్రయత్నాలు చేశారని, ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నంద్యాల శ్రీనివాస్ పాఠశాల ప్రొసీడింగ్స్ ఎలా చేశారు అంటూ గొడవ పెట్టుకున్నాడని, ప్రత్యేక సెలవుల విషయంలో గొడవకు దిగి తనను కొట్టారని పేర్కొన్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ తన ఫోన్ తీసుకొని, ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నారని బాధితుడు తెలిపాడు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



