Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటీచర్లూ...బడికి పోవాల్సిందే

టీచర్లూ…బడికి పోవాల్సిందే

- Advertisement -

– ఉపాధ్యాయులకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు
– రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు బడుల్లో త్వరలో అమలు
– ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు
– పైలట్‌ ప్రాజెక్టు కింద పెద్దపల్లిలో విజయవంతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్‌ స్కూళ్లు, తెలంగాణ సాధారణ గురుకులాలు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో చదువుతున్న విద్యార్థులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానం అమలవుతున్నది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనిదినాల్లో వెళ్తున్నారా? లేదా? అనేదానిపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేదు. దీంతో కొందరు టీచర్లు డుమ్మా కొట్టినా అడిగే వారే లేరు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్‌ బడికి వెళ్లకుండా తన స్థానంలో విద్యావాలంటీర్‌ను నియమించినట్టు సమాచారం. మరికొన్ని పాఠశాలల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులుంటే వారు రోజు వారీగా మాట్లాడుకుని ఒక వారం కొందరు టీచర్లు, ఇంకోవారం ఇంకొందరు టీచర్లు వెళ్తున్నట్టు తెలిసింది. వారందరూ నెలలో అన్ని పనిదినాల్లో వచ్చినట్టు రిజిస్టర్‌లో సంతకాలు మాత్రం చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఉపాధ్యాయులు సక్రమంగా బడులకు హాజరు కావడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి చెక్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వ అనుమతి రాగానే రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోని ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఉపాధ్యాయులు డుమ్మా కొట్టడానికి అవకాశముండదు. ఒకరికి బదులుగా మరొకరు పాఠశాలకు హాజరయ్యేందుకు వీలుండదు. ఆ విధానం అమల్లోకి వస్తే రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌ ద్వారానే ఉపాధ్యాయుల హాజరును పరిగణనలోకి తీసుకుంటారు. ఎవరు గైర్హాజరయ్యారో వెంటనే తెలిసిపోతుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంతో ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా బడికి పోవాల్సిందేనని తెలుస్తున్నది. అయితే పర్యవేక్షణ సక్రమంగా లేకున్నా బడికి రోజూ సక్రమంగా వెళ్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా లేకపోలేదు. అలాంటి ఉపాధ్యాయులు ఉండడం వల్లే నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (న్యాస్‌)లో తెలంగాణ స్థానం మెరుగైంది.


ప్రత్యేకంగా యాప్‌ రూపకల్పన
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో 30,137 ప్రభుత్వ పాఠశాలల్లో 23,71,772 (38.89 శాతం) మంది విద్యార్థులు చదివారు. 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా డీఎస్‌ఈ-ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రూపకల్పన చేసింది. ఉపాధ్యాయులు స్మార్ట్‌ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే హాజరును నమోదు చేయాలి. ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరైన కచ్చితమైన సమయం కూడా నమోదవుతుంది. ప్రస్తుతం వందల మంది ఉపాధ్యాయులు హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణం చేస్తూ బడులకు వెళ్తున్నారు. వారిలో చాలా మంది పాఠశాల ప్రారంభమయ్యే సమయానికి చేరుకోవడం లేదు. ప్రార్థన సమయంలో ఎక్కువ మంది టీచర్లు ఉండడం లేదన్న ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం అమల్లోకి వస్తే ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయుల వివరాలు ప్రతిరోజూ విద్యాశాఖ అధికారులకు తెలిసిపోతుంది. హాజరును తెలుసుకోవడానికి గతంలో పాఠశాలకు వెళ్లాలి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా పాఠశాలలకు వెళ్లకుండానే ప్రతిరోజూ హాజరుపై పర్యవేక్షణ పెరగనుంది. ఇంకోవైపు సమయానికి టీచర్లు బడులకు వెళ్లడానికి అవకాశముంటుంది. దానివల్ల బోధన మెరుగవుతుందనీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అధికారులు చెప్తున్నారు.


ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం : నవీన్‌ నికోలస్‌
డీఎస్‌ఈ-ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా అమలైందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్‌ నికోలస్‌ చెప్పారు. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని అమలు చేశామని అన్నారు. అదే విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని వివరించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -