ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీటీజేఏసీ) సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరారు. దీనివల్ల ఖాళీగా ఉన్న 634 ఎంఈవో పోస్టుల నిండి పర్యవేక్షణ కూడా పెరుగుతుందని వివరించారు. 20 ఏండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశామని టీటీజేఏసీ చైర్మెన్ పుల్గం దామోదర్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే ఆరోగ్య కార్డుల ఉత్తర్వులను విడుదల చేయాలని అన్నారు. డీఏ ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం లోకల్ బాడీ ఉపాధ్యాయుల క్యాడర్ ఆర్గనైజ్ అయినందున సర్వీస్ రూల్స్ అమలు చేసేందుకు ఎలాంటి ఆటంకాల్లేవని వివరించారు.
కోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలననుసరించి డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. టెట్ నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయాలని సూచించారు. అన్ని గురుకుల పాఠశాలల్లో సమయసారిణిని మార్పు చేయాలని చెప్పారు. మోడల్ స్కూల్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలని అన్నారు. ఒకేషనల్ టీచర్లకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్‌ను వర్తింపజేయాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాద్యాయుల పెండింగ్ బిల్లుల కోసం నెలవారీ చెల్లించే నిధులను రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలని కోరారు. కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, టీటీజేఏసీ నాయకులు రాజగంగారెడ్డి, గిరిధర్‌గౌడ్, అబ్దుల్లా, క్రాంతికుమార్, కటకం రమేష్, రాఘవరెడ్డి, కృష్ణమూర్తి, విజయసాగర్, షకీల్, శ్రీనివాస్, దిలీప్‌రెడ్డి, రమేష్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



