Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంఅధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– ఇంటర్‌ విద్యా డైరెక్టర్‌కు టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్యను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వస్కుల శ్రీనివాస్‌, కొప్పిశెట్టి సురేష్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. 2023, మేలో క్రమబద్ధీకరించిన అధ్యాపకులకు రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. వార్షిక ఇంక్రిమెంట్‌ విషయంలో కొంతమంది కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లా మనీ, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నూతన అధ్యాపకుల సర్వీస్‌ విషయాలకు సంబంధించి ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామనీ, ఎవరైనా కావాలని ఇబ్బందులకు గురిచేస్తే అధికారుల దృష్టికి తేవాలన్నారని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి జరిగే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారని తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగేలా చూడాలన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు డీఐఈవోలు, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లామన్నారని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు చూస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వారికి హాస్టల్‌ వసతి కల్పించేలా కలెక్టర్ల సహకారం తీసుకుంటామని తెలిపారు. అనంతరం నూతన అధ్యాపకుల సర్వీస్‌ విషయంలో రక్షణ కల్పించాలంటూ అధికారుల కమిటీ చైర్మెన్‌ నవీన్‌ మిట్టల్‌ను వారు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో టీజీజేఎల్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయిని శ్రీనివాస్‌, గోవర్ధన్‌, పూర్ణచందర్‌, సాయిలు, కేపీ శోభన్‌బాబు, మహిళా కార్యదర్శి సంగీత, నాయకులు షాహీనాబేగం, విశాలాక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -