నేను అడవిని మాట్లాడుతున్నాను అనే పుస్తకం నన్నెంతగానో ఆలోచింపజేసిన కవిత్వం. దీనిని సుద్దాల అశోక్ తేజ వాశారు. అడవి, నేల, మన్ను, పల్లె, ఉద్యమం.. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎన్నో చక్కని పాటలు రాశారు. అలాగే ఈ పుస్తకంలో అడవి తన గురించి మనకు చెబితే ఏమేమి చెబుతుందో రాశారు. ఏ చిన్న విషయం కూడా అడవి వదిలిపెట్టలేదు. బాధలు, బాధ్యతలు, గొప్పలు, తిప్పలు, తను చూసిన చరిత్ర, పురాణాలు, పరిణామాలు… ఇలా ఎన్నో… తను సాక్ష్యంగా చూసిన నేరాలు, ఘోరాలు.. .వాటిని చూడలేక కార్చిన పసరు కన్నీరు.. అశోక్ తేజ అడవి గురించి రీసెర్చ్ చేశారు అనిపిస్తుంది చదువుతుంటే. 33 శీర్షికలతో అడవిని ఆవిష్కరించిన తీరు మాటల్లో చెప్పలేం. వర్ణనలో తీసుకున్న ఉపమానాలు, సష్టించిన కొత్త పదాలు, లయాత్మక పద ప్రయోగాలు, భావ గర్భిత కావ్య కూర్పు అశోక్ తేజ సినీ కవిగానే కాదు శిష్ట కవిగా కూడా లబ్ద ప్రతిష్టులు అనడంలో సందేహం లేదు. అడవి ఆకుపచ్చ వలువలూడ్చబడుతున్న కలియుగారణ్య ద్రౌపదిని మాట్లాడుతున్నానంటుంది. పుడమి తల్లి బొడ్డు తాడు తెంపివేసుకొనని జన్మ తనదంటుంది. తనలో అనాగరికత, ఆటవికత లేదని, తనలో ఉన్నది అరణ్యకత, ఆటవీయత అని తన అమాయకత్వాన్ని వివరిస్తుంది. ఆదికవి క్షేత్రాన్ని, నిరతాన్న సత్రాన్ని, వన మూలికా వనాన్ని…. ఇలా తాను బాధ్యతారణ్యాన్ని అని విపులీకరించుకుంది. ఏరులు, నదులు, జలపాతాలు, కొండలు, గిరులు, లోయలు, వంపులు.. ఇలా తను ఎన్ని అందాలకు నెలవో, ఎన్ని ప్రకతి సౌందర్యాలను ప్రకటిస్తుందో కూడా చెబుతుంది. తనను పరిశీలించి, పరిశోధించి మనిషి చేసిన ఆవిష్కరణలు ఏకరువు పెడుతుంటే మనల్ని మనం చిన్న బుచ్ఛుకోవల్సిందే. అడవికి మనసులో నమస్కరించుకోవాల్సిందే. తన మీద మానవ జాతి చేస్తున్న దోపిడీ గొంతెత్తి నిరసిస్తూ, మనల్ని మరల మరల సమీక్షించుకోమంటుంది. తనను కాపాడకపోతే మానవ మనుగడ కష్టమని హితబోధ చేస్తుంది. అందుకోసం చెట్టు చెట్టుకూ ఓ ఆధార్‌కార్డ్ ఇవ్వమంటుంది. అడవి అడవికీ ఓ ఆరోగ్య శ్రీ పథకం కావాలంటుంది. దేశమంటే మనుషులే కాదు మట్టి చెట్టు కూడా అని ఓ నూతన మార్గ నిర్దేశనం చేస్తుంది. ఆసుపత్రులు అవసరం లేని భూగోళం నా కల అంటూ వెనక్కి వెళ్లలేని మానవ పరిణామం ప్రకతినే మళ్లీ వెనక్కి పిలవమని అంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కతి పచ్చని ప్రకతి గీత. ప్రతి ఒక్కరూ చదవాల్సిన రాత. విశ్వ విద్యాలయాలలో ‘ఎన్విరాన్మెంటల్ స్టడీస్’లో పాఠ్యాంశంగా పరిగణించాల్సిన బోధ.
– ప్రేమ్‌సాయి రవికుమార్, 87902 91473
పాఠ్యాంశంగా పరిగణించాల్సిన బోధ
- Advertisement -
- Advertisement -


