రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 142పరుగులకే పరిమితం
తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ గెలుపు
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను శుభ్‌మన్ గిల్ సేన రెండున్నర రోజుల్లోనే ముగించి, ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శుభ్‌మన్ గిల్ సేన.. కరేబియన్ జట్టును ఏ దశలోనూ కోలుకోనీయలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టులో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అర్ధసెంచరీతో రాణించడంతో భారతజట్టు 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల భారీ ఆధిక్యత లభించింది.
శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు బ్యాటర్లు మళ్లీ నిరాశపరిచారు. దీంతో వెస్టిండీస్ జట్టు 45.1ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో చుట్టేయడంలో స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సిరాజ్ 31 పరుగులిచ్చి 3 వికెట్లు, జడేజా 54 పరుగులకు 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన సిరాజ్, తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా జరగనుంది.
నితీష్ కుమార్ కళ్లు చెదిరే క్యాచ్..
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన కళ్లు చేదిరే క్యాచ్ పట్టాడు. వెస్టిండీస్‌తో మూడో రోజు తొలి సెషన్‌లో పక్కకు డైవింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టారు. ఈ అద్భుతమైన క్యాచ్‌తో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ పెవిలియన్ కు చేరాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ క్యాచ్ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 8 పరుగుల పెవీలియన్‌కు చేరాడు.
స్కోర్‌బోర్డు…
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 162ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 448/5డిక్లేర్డ్
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి)సాయి సుదర్శన్ (బి)జడేజా 14, చంద్రపాల్ (సి)నితీశ్ రెడ్డి (బి)సిరాజ్ 8, అథంజే (సి అండ్ బి)సుందర్ 38, కింగ్ (సి)రాహుల్ (బి)జడేజా 5, ఛేస్ (బి)కుల్దీప్ 1, హోప్ (సి)జైస్వాల్ (బి)జడేజా 1, గ్రీవ్స్ (ఎల్‌బి)సిరాజ్ 25, పియరీ (నాటౌట్) 13, వర్రికన్ (సి)గిల్ (బి)సిరాజ్ 0, లియనే (సి)సిరాజ్ (బి)జడేజా 14, సీల్స్ (సి అండ్ బి)కుల్దీప్ 22, అదనం 5. (45.1ఓవర్లలో ఆలౌట్) 146పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/24, 3/34, 4, 35, 5/46, 6/92, 7/98, 8/98, 9/122, 10/146
బౌలింగ్: బుమ్రా 6-1-16-0, సిరాజ్ 11-2-31-3, జడేజా 13-3-54-4, కుల్దీప్ 8.1-3-23-2, సుందర్ 7-1-18-1.