పంట దిగుబడి అయ్యేంత వరకు కష్టాలు
అకాల వర్షాలతో రైతన్నలకు నష్టాలు
ఎకరానికి పంట నష్టం 30 వేలు ఇవ్వాలి
అకాల వర్షంతో పడిపోయిన పంటలను పరిశీలించిన జూలకంటి
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. నారుమళ్లు వేసిన నాటు నుంచి మొదలుకొని దుక్కిలు దున్ని, నాట్లు వేసి, యూరియా చల్లి, పొలాలకు సరిపోను సాగు నీరు అందించి, అకాల వర్షాలకు తట్టుకొని, చివరికి పండించిన పంటల అమ్ముకునే వరకు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు…తాజా ఈ వానకాలం సీజన్లో యూరియా కష్టాలు తట్టుకొగా ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. నల్గొండ జిల్లాలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లాలో వేలాది ఎకరాల పంట నేలకొరిగింది. అలా పడిపోయిన పంటలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లోని ఐలాపురం గ్రామ శివారులోని పొలాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి శుక్రవారం పరిశీలించారు.
నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి నేలకొరిగిన పొలాలను పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేసుకుంటున్నా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 40 వేల కు పైగా పెట్టుబడి పెట్టారని తీరా ఇప్పుడు ఆకాల వర్షాలతో పంట మొత్తం దెబ్బతిన్నదన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్ట పోయిన పంటలకు ఎకరానికి 30 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటన చేసి విచారణ జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మూడవత్ రవి నాయక్, పాదూరి శశిధర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయన్న, హనుమ నాయక్, చిన్న సాయన్న, నాగేశ్వర రావు నాయక్, వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





