Tuesday, September 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికన్నీటి కరూర్‌

కన్నీటి కరూర్‌

- Advertisement -

దేశంలో రాజకీయ సభలు కేవలం బలప్రదర్శన వేదికలుగా మారాయనడానికి నిన్నటి తమిళనాడు ఘటన ఓ తాజా ఉదాహరణ. కరూర్‌లో విజయ్ ప్రచారసభ ఏకంగా 41మందిని పొట్టనపెట్టుకుంది. వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహిళలు, ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డలు విగత జీవులుగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. బిడ్డల్ని చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయిన కన్నబిడ్డల్ని చివరిసారిగా ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశాలు ఆస్పత్రి వర్గాల్ని సైతం కన్నీరు పెట్టిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించిన టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్… గత మూడు వారాలుగా ప్రతి శని, ఆదివారాల్లో ‘ర్యాలీ’లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ శనివారం…నామక్కల్‌, కరూర్‌లో సభలు ఏర్పాటు చేశారు. ఆ రెండు సభలకు ఆయన దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా రావడం ఒక కారణమైతే… తమ అభిమాన (కథా) నాయకుడిని చూసేందుకు యువకులతో పాటు… పిల్లలు, మహిళలూ భారీగా తరలి రావడంతో కరూర్‌ వీధులు కిక్కిరిసిపోయాయి. ఎండ మండిపోతున్నా లెక్క చేయకుండా గంటలకొద్దీ వేచిచూశారు. విజయ్ ప్రసంగం ప్రారంభించగానే… మహిళలు, పిల్లలు ఆయన హీరోను దగ్గరగా చూడాలని కోరుకునే.. అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట మొదలైంది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అప్పటికే నీరసించిన జనంలో కొందరు స్పృహతప్పి పడిపోయారు… దీన్ని గమనించిన విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే… పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఉండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్‌ని స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఎక్కినవాళ్లు కిందికి దూకారు. ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు… ఆపై చీకటి… అటు జన ప్రవాహం, ఇటు ఒకరిమీద ఒకరు పడటంతో పెను విషాదమే చోటుచేసుకుంది.

వాస్తవానికి రాజకీయ పార్టీలు బలం కంటే వాపును ప్రదర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అందుకు ఆయా పార్టీలు బిర్యానీ పొట్లాలు, మద్యం సీసాలు, డబ్బులు ఎరవేసి భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. దాంతో ఎక్కడికక్కడ రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. సభలూ ర్యాలీలకు జనాన్ని తరలించడానికి ప్రజారవాణా వ్యవస్థను స్తంభింపజేసే రాజకీయ పక్షాల పెడపోకడలు దేశం మొత్తం విస్తరించాయి. రాజకీయ పార్టీల నిర్వాకాలకు తగినట్టే ప్రజలు సైతం ఇష్టమైన నేతలను చూడాలన్న ఆరాటంలో విద్యుత్‌ స్తంభాలు, కటౌట్లు, లౌడ్‌స్పీకర్లు ఎక్కుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఇసుకేస్తే రాలనంతగా జనం గుమికూడే చోట్లకు మహిళలూ పిల్లలను తీసుకెళ్లడం సురక్షితం కాదనే స్పృహ కొరవడుతోంది.

మొత్తంగా ఈ దుర్ఘటన జనసమూహ నియంత్రణ సరిగా లేకపోవడం, పోలీసు నిఘా వైఫల్యం వల్ల కలిగిన ఘోరమైన పరిణామాలను స్పష్టంగా బహిర్గతం చేస్తున్నది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా, బెంగళూరులో ఆర్‌సిబి ఐపిఎల్‌-విజయోత్సవ వేడుకలు, ఢిల్లీ రైల్యేస్టేషన్‌, తిరుపతి క్యూలైన్‌లో, బోలే బాబా పాదదూళి ఘటన, ఇలా దేశవ్యాప్తంగా అనేక మతపరమైన, రాజకీయ కార్యక్రమాల సమయంలో జరిగిన తొక్కిసలాటల పునరావృతం ఇది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ తరహా తొక్కిసలాట జరగడం, పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడం..రాజకీయ పార్టీల్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. తమ భవిష్యత్తు ప్రణాళిక ఎలా చేసుకోవాలా? అన్న సందిగ్ధంలో పడేసిందీ ఘటన. ఇంత పెద్ద సంఖ్యలో బలితీసుకున్న తొలి రాజకీయ సభ తొక్కిసలాటగా కరూర్‌ సభ పెను విషాదం మిగిల్చింది.

వ్యక్తులపై, సంస్థలపై అభిమానం, ప్రేమానురాగాలు ఉండొచ్చు. కానీ అవి ఎప్పుడూ శృతిమించరాదు. కొన్ని సందర్భాల్లో కొందరు సినిమా నటీనటులు, రాజకీయనేతలు, క్రీడాకారుల అభిమానులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరమే కాదు ఆందోళన కలిగిస్తున్నది. అభిమానం హద్దుల్లో ఉంటే అందరికీ శ్రేయస్కరం. కానీ హద్దులు దాటి వ్యవహరిస్తే జరిగే పరిణామాలు విషాదభరితంగా మారి… ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయి. అమాయకులు బలైపోతుంటారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. డ్రోన్‌ విజువల్స్‌తో జనాన్ని చూస్తే పూనకం వచ్చి ఊగిపోయే రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు. దీంతో పలు పార్టీలు భారీ బహిరంగ సభలూ, రోడ్డు షోల నిర్వహణకు మొగ్గుచూపుతున్నాయి. కానీ ప్రజల భద్రతను గాలికొదిలేస్తున్నాయి.కనీస రక్షణా ఏర్పాట్లు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి! ఈ పరిస్థితి మారాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -