Thursday, February 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'సాంకేతిక' సందిగ్ధం!

‘సాంకేతిక’ సందిగ్ధం!

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘ఇండియా-ఎ.ఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026’ సందర్భంగా అనేక కీలకాంశాలు తెరమీదకు వచ్చాయి. భారత్‌ను గ్లోబల్‌ సౌత్‌కు సాంకేతిక కేంద్రంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆ దిశలో తీసుకుంటున్న చర్యలే ప్రశ్నార్ధకంగా మారాయి. అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే సంగతి అలా ఉంచితే ప్రపంచ స్థాయికి సరితూగే లేదా దగ్గరగా ఉన్న పునాది స్థాయి వ్యవస్థ (ఫౌండేషన్‌ మోడల్‌) కూడా మన దగ్గర లేదు. ఈ రంగంలో ఇప్పటికే నాయకత్వం వహిస్తూ ప్రపంచానికి దిశా నిర్దేశం చేస్తున్న అమెరికా, చైనాలు పెద్ద ఎత్తున నైపుణ్యాలను, పరిశోధనలను విస్తృతం చేస్తుండగా, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దాని దగ్గరే నిలబడిపోయాం. ప్రాథమిక స్థాయి వ్యవస్థను పూర్తిస్థాయిలో స్వదేశీ పునాదిమీద ఏర్పాటు చేసుకోవడం భవిష్యత్తులో అన్ని విధాలా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, అన్ని అంశాలకు అమెరికా వైపు చూసే నరేంద్రమోడీ ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోవడం అనుమానమే! అట్టహాసంగా నిర్వహిస్తున్న ఎఐ సదస్సులో ఇప్పటి వరకు అటువంటి ప్రకటన ఏదీ కేంద్ర ప్రభుత్వం నుండి వెలువడకపోవడమే ఈ అనుమానానికి కారణం. ఫౌండేషన్‌ మోడల్‌ సంగతి అలా ఉంచితే, లార్జి మోడల్స్‌ ట్రైనింగ్‌కు అవసరమైన హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్లు కూడా అందుబాటులో లేవు. ఇవేవీ లేకుండా గ్లోబల్‌ లీడర్‌షిప్‌ గురించి, అప్పుడు వెల్లువెత్తే అవకాశాల గురించి మాట్లాడటం ఆకాశానికి నిచ్చెనలు వేయడమే! ఇంపాక్ట్‌ సమ్మిట్‌ కోసం నిటిఆయోగ్‌ రూపొందించిన నివేదిక ప్రకారం ఎఐ రంగంలో మన దేశం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి మరో పది నుండి ఇరవై ఏళ్లు పడతాయట! ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ‘ప్రత్యేక’ ఇంటర్వ్యూలో 2047 నాటికి ఎఐ రంగంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా నిలపనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

‘కేవలం ఎఐ వినియోగదారునిగా కాకుండా ఎఐ సృష్టికర్తగా, ఎఐ విప్లవంలో భాగస్వామి దశ నుండి దానిని శాసించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దు తున్నాం’ అని మోడీ అన్నారు. ఈ మాటలు ఎలా ఉన్నప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ కొత్త సాంకేతికత ఉనికిలోకి వస్తుందో తెలియదు! మరోవైపు ప్రపంచంలో ఎఐ అభివృద్ధి విస్ఫోటనం చెందుతోంది. శక్తివంతమైన నమూనాలకు శిక్షణ ఇచ్చే కంప్యూటింగ్‌ శరవేగంగా పెరుగుతోంది. ప్రత్యేకమైన చిప్‌ల తయారీ కోసం పెద్దఎత్తున పోటీ జరుగుతోంది, భారీ టెక్‌ సంస్థలు ఎఐలోకి పెద్ద మొత్తాలను కుమ్మరిస్తున్నాయి. 2024 నుండి అమెరికా, చైనాలు ఈ రంగంపై దృష్టి సారించి భారీ మొత్తంలో ఖర్చు చేస్తుండగా, మన దేశంలో మోడీ సర్కారు ఈ రంగ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేయనుందన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు.

మరోవైపు ఎఐ వృద్ధి పేరుతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడనుంది. న్యాయవ్యవస్థలో కూడా ఎఐ వినియోగంపై జాగ్రత్త అవసరమని ఇటీవల సుప్రీంకోర్టు సూచించింది. ఆరోగ్య రంగంలోనూ ఇటువంటి ఆందోళనలే వ్యక్తమవుతున్నాయి. మీడియా, రాజకీయ రంగాల్లో డీప్‌ఫేక్‌ల భయాలు ఇప్పటికే ప్రారంభమైనాయి. పెద్ద టెక్‌ సంస్థల ఆధిపత్యం పెరిగితే డేటా, మౌలిక వసతులు వారి చేతుల్లోనే కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బలమైన పారదర్శక చట్టాలు, డేటా రక్షణ, నైతిక నియంత్రణ, సమగ్ర శిక్షణ విధానాలను అందరితో చర్చించి పారదర్శకంగా రూపొందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అదే విధంగా దేశంలో ఉన్న యువశక్తిని సమర్ధవంతంగా వినియోగించుకోవడంతో పాటు, డేటా సెంటర్లు, ఫౌండేషన్‌ మోడల్స్‌, చిప్‌ తయారీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఢిల్లీ ఎఐ సదస్సులో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలతో పాటు, మేడ్‌ ఇన్‌ చైనా రోబోడాగ్‌ను తమ సొంత ఆవిష్కరణగా ప్రకటించుకుని నగుబాటైన గల్గోటియాస్‌ యూనివర్శిటీ నిర్వాకం అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను మసకబార్చాయి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -