డిజిటల్ గవర్నెన్స్‌లో రోల్‌మోడల్‌గా తెలంగాణ
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌ను సామాన్యుడికి చేరువ చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికి రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్‌వేర్‌గా కాకుండా, ట్రాన్స్‌ఫార్మేషన్ టూల్‌గా మార్చుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్- ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరసేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి, ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఐకం(ఏఐకేఏఎమ్), ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూభారతి వంటి డిజిటల్ గవర్నెన్స్ సంస్కరణలను వెల్లడించారు. అలాగే సాంకేతికతను వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్‌ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర రంగాలకూ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
స్వీడన్ వాణిజ్య ప్రతినిధులతో భేటీ
తెలంగాణలోపెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు స్వీడన్ వాణిజ్య ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధలు, ఆవిష్కరణలకు ప్రభావవంతమైన టాలెంట్‌పూల్ ఉన్నదనీ, కృత్రిమ మేథ వల్ల ఎదురయ్యే సవాళ్లు, వాటిద్వారా అందివచ్చే అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరుగుతున్న ఏఐ అంతర్జాతీయ సమ్మిట్‌లో స్వీడన్ వాణిజ్య ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐ విస్తృతితో ఉద్యోగ విధుల్లో గణనీయమైన మార్పులు వస్తాయనీ, దానికి అవసరమైన సన్నధతను తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఏఐ పరిశోధనా కేంద్రాలు, అప్లికేషన్లు, సేవల వల్ల కొత్త ఉద్యోగాలు ఫుట్టుకొస్తాయనీ, యువతరం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.



