సుమారు 50 ఎకరాల్లో పంట నష్టం
నవతెలంగాణ తిమ్మాపూర్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు బొమ్మలకుంట చెరువు కట్ట తెగిపోయిన ఘటన, స్థానిక రైతులను తీవ్రంగా కలచివేసింది. సుమారు 50 ఎకరాల్లో సాగు చేసిన వరిపంట పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ప్రజలు అధికారుల నిర్లక్ష్యాన్నే ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు.
గత సంవత్సరంలో కూడా ఇదే బొమ్మలకుంట చెరువు కట్ట తెగిపోయింది. అప్పుడు అధికారులు కేవలం నామమాత్రపు మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువు కట్టను శాశ్వత ప్రాతిపదికన పటిష్టంగా నిర్మించకపోవడం వల్లే ఈ ఏడాది మళ్లీ కట్ట తెగిపోయిందని, దీనివల్ల పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు.

ఇట్టి విషయంపై అధికారులు వెంటనే స్పందించి, పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చెరువు కట్టకు పటిష్టమైన మరమ్మతులు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నష్టం నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.