సరిహద్దు కర్రెగుట్టల్లోని పామునూరులో పోలీస్ అవుట్ పోస్ట్
ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు
ప్రజల్లో భరోసా కల్పించేందుకే అడవుల్లో రోడ్లు : తెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి
దట్టమైన అడవుల్లో పర్యాటక కేంద్రం అభివృద్ధి చేస్తాం : సీసీఎఫ్‌వో సువర్ణ
నవతెలంగాణ-వెంకటాపురం
రాష్ట్రంలోనే ఎత్తయిన కొండల్లో మావోయిస్టు కంచుకోటగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్టలోని దట్టమైన అడవుల్లో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి మావోయిస్టు విముక్తి ప్రాంతంగా తెలంగాణ ప్రజల్లో భరోసా కల్పించేందుకే రోడ్లు వేసి, గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలంగాణ డీజీపీ బి. శివధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో సీసీఎఫ్‌వో సీహెచ్. సువర్ణతో కలిసి పామునూరు బేస్ క్యాంపులో పోలీస్ అవుట్ పోస్ట్, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్‌లకు శంకుస్థాపనలు చేశారు. కర్రెగుట్టలోని పామునూరు బేస్ క్యాంప్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న డీజీపీకి పోలీసులు గౌరవ వందనం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ గుట్టల్లో నివాసముంటున్న గిరిజనుల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. వారికి రవాణా సదుపాయం కల్పించేందుకు మురుమూరు నుంచి డోలి, తడపల, చెలిమల మీదుగా గుట్టల్లో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే 13 కి.మీ మేర రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 18 కి.మీ మేర రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులు పూర్తయితే తెలంగాణ నుంచి చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా వరకు రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల అభివృద్ధి వారికి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పామునూరు గిరిజనులకు తాగునీటి సౌకర్యం కోసం బోరుబావిని ఏర్పాటు చేశామన్నారు. రవాణా కోసం ఒక ఆటో, ద్విచక్ర వాహనంతోపాటు ఆ కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేసినట్టు తెలిపారు.
‘తెలంగాణ ఫ్రీ నక్సల్స్ జోన్‌గా ప్రకటించారు’ అని విలేకరులు అడగగా తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా గతంలోనే ప్రకటించామని డీజీపీ గుర్తు చేశారు. అజ్ఞాతంలో ఆరుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, వారు సైతం వేరే రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. తెలంగాణతోపాటు పక్కనే ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మావోయిజం అంతమైందన్నారు. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో దట్టమైన అడవులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీసీఎఫ్‌ఓ సువర్ణ తెలిపారు. కర్రెగుట్టలో ఎన్నో అందమైన వాటర్ ఫాల్స్, ఎత్తయిన కొండలు, ఆహ్లాదకర వాతావరణం ఉందన్నారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఈ గుట్టలపై ఉండటంతో అవి వెలుగులోకి రాలేదన్నారు. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా కర్రెగుట్టలను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేహాండ్ అడిషనల్ డీజీపీ అనిల్‌కుమార్, ఇంటిలిజెంట్ ఏడీజీపీ విజరుకుమార్, సీఆర్పీఎఫ్ ఐజీపీ విక్రమ్, ఐజీపీ ఎస్‌ఐబీ సుమతి, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, డీఎఫ్‌ఓ కిషన్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
నక్సల్స్ విముక్తి ప్రాంతంగా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



