రాష్ట్ర చైర్మెన్‌గా ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్‌గా ప్రొఫెసర్ ఎం కోదండరాంను ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సంఘాలు, తెలంగాణ టీజేఏసీ సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ ఆకాంక్షల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం కోదండరాం నేతృత్వంలో పని చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం తక్షణమే గుర్తింపునిస్తూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ నెలలో ఉమ్మడి పది జిల్లాలలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి జిల్లా స్థాయిల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి వర్ధంతి సభను ఎల్బీనగర్‌లో ఉద్యమకారుల సమక్షంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నెలలో హైదరాబాదులో రాష్ట్రస్థాయి ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేయాలని ఈ సదస్సు తీర్మానించినట్టు కోదండరాం ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ఉద్యమకారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి మాట్లాడిస్తామని ఆయన తెలిపారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అమరవీరుల కుటుంబాలకు అండగా తదితర సమస్యలను ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు ఎం.నరసయ్య అధ్యక్షత వహించగా వివిధ తెలంగాణ ఉద్యమ సంఘాల నాయకులు, టి జేఏసీ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కాచం సత్యనారాయణ, సుల్తాన్ యాదగిరి, రామగిరి ప్రకాష్, పూస శ్రీనివాస్, తెలంగాణ వెంకన్న, తుల్జా రెడ్డి, బండి రమేష్, కుమారస్వామి, లక్ష్మారెడ్డి, నిజ్జన రమేష్, అశోక్ రెడ్డి, శ్యాంసుందర్ గౌడ్, తెలంగాణ కొమరయ్య, అంజిరెడ్డి, రూబీ, పాండు, శ్రీనివాస్, యాదగిరి, మల్లేష్, తోటనరసింహ చారి పాల్గొన్నారు.



