– సీఎం రేవంత్‌రెడ్డికి కూనంనేని విజ్ఞప్తి
– విషం చిమ్మేందుకే 17న అమిత్‌షా వస్తున్నారంటూ విమర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరితోపాటు తెలంగాణ ప్రాంత విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మట్టి మనుషులంతా ఏకమై దొరలు, భూస్వాములు, జాగీర్దార్ల గడీల బద్దలు కొట్టిన మహత్తర ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని వివరించారు.
ఆలాంటి వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు అందించాల్సిన అవసరముందన్నారు. కానీ గత ప్రభుత్వం సమైక్యతా దినోత్సవమంటూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సమంటూ రకరకాల పేర్లతో వేడుకలు జరపడమేంటని ప్రశ్నించారు. ప్రతిరోజూ ప్రజాపాలన ఉంటుందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ సాయుధ అనే పేరు పలికేందుకు భయముంటే తెలంగాణ రైతాంగ పోరాటం పేరుతోనైనా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే మంచి పేరు, గుర్తింపు వస్తుందని సూచించారు. కర్నాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు జరుగుతాయని గుర్తు చేశారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, చరిత్రకు వక్రీకరించేందుకు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై విషం చిమ్మేందుకు ఈనెల 17న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వస్తున్నారని విమర్శించారు. నాటి పోరాటంలో అమరులైన యోధుల త్యాగాలతోపాటు వారి చరిత్రను భావి తరాలకు అందించేందుకు హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, ధర్మభిక్షం వంటి మహానేతల విగ్రహాలను ట్యాంక్‌బండ్ లేదా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులు ప్రాణత్యాగం చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా చెప్పారు. బీజేపీ ఇప్పుడు చరిత్రను వక్రీకరించడం హేయమైన చర్య అని విమర్శించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అధికారికంగా జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES