ఆయన ప్రజా సేవలు ప్రశంసనీయం : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షులు బండ్రు విమలక్క
నవతెలంగాణ -ఆలేరుటౌన్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, ప్రజా విమోచన పత్రిక పూర్వ సంపాదకులు, సీపీిఐ(ఎంఎల్) జనశక్తి నాయకులు బండ్రు నరసింహులు సేవలు ప్రజా ప్రశంసనీయమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌరవాధ్యక్షులు బండ్రు విమలక్క అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జనశక్తి నాయకులు బండ్రు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి వర్ధంతి సందర్భంగా అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపాల వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచన విధానం వెలుగులో పీడిత ప్రజల విముక్తి కోసం, భారత విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి, పొట్ల రామ నర్సయ్య, నీలం రామచంద్రయ్య, బండ్రు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి ఇలా ఎంతోమంది విప్లవ రాజకీయాల వెలుగులో ముందుకు సాగుతూ అమరులయ్యారని తెలిపారు. అమరులను స్మరించుకుంటూ వారి బాటలో నిజాయితీగా ముందుకు సాగడమే వారికి ‘మనం’ అందించే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమరుల స్మారక కమిటీ నాయకులు పల్స యాదగిరి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు యాకయ్య, రైతు కూలీ సంఘం నాయకులు ఇప్ప రామకృష్ణ, ఏనుగుల విష్ణు, నారాయణ శీను, పారెల్లి సత్తయ్య, పెద్దలు, పెంట రమేష్ (లాయర్) బండ్రు నరసింహులు,పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



