Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయంరాష్ట్రపతి పరిశీలనలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లులు

రాష్ట్రపతి పరిశీలనలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లులు

- Advertisement -

లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉపాధి, లోకల్‌ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర న్యాయ సామాజిక, సాధికారిక శాఖ సహాయ మంత్రి బీఎల్‌ వర్మ స్పష్టం చేశారు. ‘తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ పంపిన బిల్లులు అందాయి. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయి’ అని ఒక ఎంపీ(ఈటెల రాజేందర్‌) అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా… బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశ పెట్టింది. ఈ రెండు బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఆ తర్వాత ఆ బిల్లులను చట్ట రూపంలోకి మార్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం కోసం పంపింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ బిల్లుల విషయంలో గవర్నర్‌ ఆమోదం తెలపకుండా న్యాయసలహా కోరారు. అనంతరం ఈ బిల్లులను రాష్ట్రపతికి సిఫారసు చేశారు. అప్పటి నుంచి ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. అయితే… ఈ రెండు బిల్లులు చట్ట రూపంలోకి మారితే పెంచిన రిజర్వేషన్ల ఆధారంగా బీసీలకు న్యాయం చేస్తూ పంచాయితీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపి సర్కార్‌ వీటిని మతపర రిజర్వేషన్లుగా ఆరోపిస్తూ మోకాలడ్డింది. దీంతో బీసీలకు మేలు చేసేలా బిల్లులను ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో సీఎంతో పాటు రాష్ట్ర బీసీ మంత్రులు, కార్పొరేషన్ల చైర్మెన్లు, బీసీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ రాకుండా మోడీ, అమిత్‌ షా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపియే ఈ బిల్లులను అడ్డుకుంటుందని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని ఫైర్‌ అయ్యారు. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం స్పందిం చకపోవడంతో… పాత రిజర్వేషన్లతోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లోకల్‌బాడీ ఎన్నికల్ని నిర్వహించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -