నగర్‌వన్ యోజన కింద రూ. 8.26 కోట్ల నిధుల మంజూరు
తొలి విడతలో 70 శాతం నిధుల విడుదల:డాక్టర్ సి.సువర్ణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పట్టణాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్‌వన్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కీలక ప్రోత్సాహం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో 6 కొత్త అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు అనుమతి లభించింది. వీటికోసం రూ.8.26 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డా.సి సువర్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంజూరైన నిధుల్లో మొదటి విడతలో 70 శాతం నిధులను ఇవ్వనున్నారు. ఈ నిధులు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ పరిధిలోని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా వినియోగించనున్నారు. నగరాలు, పట్టణాల పరిధిలో అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. నగర్‌వన్ యోజన కింద ఏర్పాటయ్యే అర్బన్ ఫారెస్ట్‌లలో స్థానిక వృక్ష జాలానికి ప్రాధాన్యం ఇస్తూ విస్త ృతంగా మొక్కలు నాటనున్నారు. నడక మార్గాలు, విశ్రాంతి కేంద్రాలు, పచ్చని మైదానాలతో ప్రజలకు ప్రకృతి ఒడిలో విహరించే అవకాశం కల్పించనున్నారు. పిల్లలు, వృద్ధులు, ఉదయం, సాయంత్రపు వాకర్లకు ఈ అర్బన్ ఫారెస్ట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో మావళా, యాపల్‌గూడ-2, మంచిర్యాల జిల్లా ఇందారం (క్యాతనపల్లి మండలం), చెన్నూర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో యెల్లంపేట, చెంగిచెర్ల ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ లకు ఆమోదం లభించింది. ఈ అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుతో పట్టణాల్లో హరితావరణం విస్తరించడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడనుంది. అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. నగర్‌వన్ యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే దిశగా ఈ అర్బన్ ఫారెస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
తెలంగాణకు 6 కొత్త అర్బన్ ఫారెస్ట్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



