తెలుగింటి సంస్కృతీ సంప్రదాయమంటేనే ఓ నిండుదనం కళ్ళముందు కదులుతుంటుంది. మన పండుగలు, మన ఆచారాలు, పలకరింపులు, పేరంటాలు.. ఒక్కటేమిటి తెలుగుదనం, తెలుగుజాతి మన ప్రాంతాన్నే కాదు దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. తెలుగు ప్రాంతంలో తెలంగాణ సంస్కృతికి, పండుగలకు, పేరంటాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు, సీమంతాలలో ఆడే ఆటలు, పాడే పాటలైతే చెప్పడానికి మాటలు చాలవు. చుట్టాలు, బంధుబలగాలు చేసే సందడి అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇంటి ఆడబిడ్డకు జరిగే ఓ సీమంతం వేడుకను గురించి చెబుతూ దాసరి భాస్కర్ యాదవ్ మంచి పాటను రాశాడు. 2024లో దాసరి భాస్కర్ యాదవ్ ‘చిట్టిపొట్టి’ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తూ ఈ పాటను రాశాడు. ఆ పాటనిప్పుడు చూద్దాం.
మన ఇళ్ళల్లో పేరంటాలు జరిగితే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి హడావుడి చేస్తుంటారు. అదే సీమంతం వేడుక అయితే కడుపుతో ఉన్న ఆడబిడ్డను అలంకరించి తీసుకువచ్చి సింహాసనంపై కూర్చోబెడతారు. ముత్తయిదువులంతా చుట్టూ చేరి మంగళహారతి పడతారు. పాటలు పాడుతారు. ఈ వేడుక అంతా పాట రూపంలో ఎంతో సరళంగా చెప్పాడు భాస్కర్ యాదవ్.
తాతమ్మ, నాయనమ్మ, అమ్మమ్మలు, వాళ్ళతో పాటు అమ్మ, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు అంతా చేరి పసుపు బొట్టు పెట్టి సీమంతం జరిపిస్తారు. కడుపుతో ఉన్న ఆడపిల్లకు పిండి వంటలు చేసి పెడతారు. ఆ పిండివంటలేమిటో ఈ పాటలో వివరంగా చెప్పాడు భాస్కర్ యాదవ్.
సినిమాపరంగా చూస్తే.. ముత్తయిదవులంతా అన్ని వంటకాలు, కానుకలు సిద్ధం చేసుకుని వస్తారు. ఏమేమి తీసుకువచ్చారో పాటలో చెబుతుంటారిలా.. మేం గారెలు చేసి తీసుకువచ్చాం. తీయటి బూరెలు కూడా తెచ్చాం. గారెల్ని, బూరెల్ని ఒడిలో పెట్టి పసుపు బొట్టు పెట్టి దీవించాం. ఆ తరువాత తాంబూలాలూ కూడా ఇచ్చాం. అని చెబుతుంటారు.
పట్టుచీరలు తెచ్చినాం. పట్టుచీరలతో పాటు సారెలు కూడా తెచ్చాం. సీరెలు, సారెలు రెండూ అన్నమాట.. సారెలో మళ్ళీ వంటకాలే ఉంటాయని మనం ఇక్కడ గ్రహించాలి. సీరెలు, సారెలు ఇచ్చి గాజులేసి పదికాలాలు పచ్చగా ఉండాలని ఆశీర్వదించాం. నోట్ల శక్కరపోసి నోరు తీపి చేసినం అని చెబుతారు. మన తెలంగాణ ఇళ్ళల్లో ఏ వేడుకలు జరిగినా, ఏ పండుగలు జరిగినా నోట్లో చక్కెర పోసి నోరు తీపి చేయడం మనం గమనిస్తాం. చక్కెరని శక్కరిగా తెలంగాణలో తరచుగా వాడతాం. ఇక్కడ ఎన్ని వంటకాలు, తీపి పదార్థాలు చేసి తీసుకొచ్చినప్పటికీ వాటితో పాటు శక్కరి కూడా పోయడం సర్వసాధారణమైనదని గ్రహించాలి.
ఇలా.. ముత్తయిదవులంతా పండగ జరుపుతూ ఉంటే ఆడబిడ్డను ఆశీర్వదించడానికి, జరిగే వేడుకను కళ్లారా చూసి ఆనందించడానికి తోడబుట్టిన సోదరుడు (అన్నయ్య) వెంటనే పరుగు పరుగున వస్తాడు. వచ్చి మా చిట్టితల్లి, చిన్నితల్లి చల్లగా ఉండాలి.. పుట్టింటికి లక్ష్మి వంటిది. ఆమె సల్లగుండాలి. పసుపు కుంకుమలతో ముతైదవుగా, సౌభాగ్యాలతో, సుఖశాంతులతో హాయిగా ఉండాలని, తన చెల్లికి పండంటి పాపాయి పుట్టాలని, ఆ పాపాయి రాకతో ఇల్లంతా కళకళలాడుతూ మురిసిపోవాలని ఆ అన్న కోరుకుంటాడు.
ఇంకా.సారెలో పెట్టిన పిండివంటల గురించి రెండవ చరణంలో కూడా చెబుతున్నాడు కవి. అరిసెలు పెట్టాం. గరజాలు పెట్టాం. పూలుపండ్లు పెట్టాం. అక్షింతలు వేసి ఆశీర్వదించాం. పోలెలు, పోతప్పలు కూడా చేసి తెచ్చాం. అని పాడుతుంటారు. బూరెల్ని పోలెలుగా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటాం. పోతప్పలనే కారప్పూసగా పిలుస్తుంటాం. ఇలా.. పోలెలు, పోతప్పలు అన్నీ పెట్టి స్వీటు కూడా పెట్టాం. స్వీటు అంటే ఇక్కడ తీపిపదార్థమని అర్థం. ఇవన్నీ పెట్టి ఆశీర్వదిస్తున్నామని ఆ మహిళలంతా పాడుతూ ఉంటారు.
వెంటనే వాళ్ళ అన్న మళ్ళీ తన స్వరమందుకుని మా ముద్దులచెల్లి, బంగారుతల్లి చల్లగా ఉండాలి. మా చెల్లి వల్ల మెట్టినింటి వంశం వృక్షంలాగా విస్తరించాలి. అంటే.. వంశం వృద్ధి చెందాలి. అలా పిల్లాపాపలతో నా చెల్లి వస్తుంటే.. మేనమామనైన నేను మురిసిపోవాలి. అంతటా సంతోషం నిండాలి అంటూ పాడుతాడు.
మన కుటుంబాల్లో జరిగే సీమంతపు వేడుకల్ని కళ్ళముందుంచుతుందీ పాట. అనుబంధాలు, ఆత్మీయతలు, పండుగలను ప్రతిఫలింపజేస్తుందీ పాట..
పాట:
గారె తెచ్చినం బూరె తెచ్చినం/
గారెలిచ్చి బూరెలిచ్చి బొట్టే వెట్టినం/
పసుపు బొట్టే వెట్టినం/ తాంబూలాలిచ్చినం/
సీరేలిచ్చినం మేం సారేలిచ్చినం/
సీరేలిచ్చి సారేలిచ్చి గాజులేసినం/
పసుపు బొట్టే వెట్టినం/ నోట్ల శక్కరేసినం/
మా చిట్టితల్లి సల్లంగుండాలి/
మా చిన్నితల్లి సల్లంగుండాలి/
పుట్టింటి లక్ష్మి సల్లంగుండాలి/
పండంటి పాపాయి రావాలి ఇల్లంతా మురవాలి/
అరిసెలిచ్చినం మేం గరజాలిచ్చినం/
అరిసెలిచ్చి గరజాలిచ్చి పూలుపండ్లు వెట్టినం/
అక్షింతలేసినం/
పోలేలిచ్చినం పోతప్పాలిచ్చినం/
పోలేలు పోతప్పాలిచ్చి సీటు వెట్టినం/
పసుపుబొట్టు వెట్టినం/ ఆశీర్వాదాలిచ్చినం/
మా ముద్దుచెల్లి సల్లంగుండాలి/
బంగారుతల్లి సల్లంగుండాలి/
మెట్టింటి వంశం వృక్షం అవ్వాలి/
ఈ మేనమామ మురిసిపోవాలి/
సంతోషం నిండాలి..
డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682