నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అయితే నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ప్రకటించడంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో మండపాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.