నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడించింది. దీంతో టీజీపీఎస్సీ ప్రకటనతో ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఒక్క పోస్టు ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.
ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పరీక్షలు నిర్వహించిన 10 నెలల వ్యవధిలోనే తుది ఫలితాలు ఇచ్చామని, గ్రూప్-1 వివాదం లేకపోయి ఉంటే ఫలితాలు మరింత తొందరగా వచ్చేవని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, కట్-ఆఫ్ మార్కుల వివరాలు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in
లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ సూచించింది.