రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి ఘోర అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి ఘోర వైఫల్యం వల్లే తెలంగాణకు దక్కింది గుండు సున్న మిగిలింది మొండి చెయ్యి మాత్రమేనని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పుష్కరకాలంగా తెలంగాణకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం కేటాయించలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న కేసులను, అవినీతి ఆరోపణల నుంచి ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడం తప్పించి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడాబాయ్ తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన చోటాబాయ్ మాటలు అన్ని బూటకమేనని బడ్జెట్ సాక్షిగా తేలిపోయిందని తెలిపారు. ఈ అనుబంధం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏం సాధించిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మోసేందుకు, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం, చేసిన స్కాములపై విచారణ చేయకుండా, కేంద్రంలోని బీజేపీ నేతల వద్దకు వెళ్లడమే తప్ప తెలంగాణ హక్కుల కోసం గట్టి పోరాటం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, కొత్త రైల్వే లైన్లకు నిధులు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐటీ, ఐఐఎం, విద్యాసంస్థల ఏర్పాటు, ఖమ్మంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి అనేక కీలక డిమాండ్లపై తాము గత పదేండ్లకు పైగా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశామని గుర్తు చేశారు. ఏ ఒక్కదానికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని వివక్షతో చూస్తున్నది పేర్కొన్నారు. తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం : హరీశ్‌రావు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఏండ్లు గడుస్తున్నాయి, బడ్జెట్‌లు మారుతున్నాయి తప్ప, తెలంగాణకు నిధుల కేటాయింపులో చూపుతున్న కేంద్రం వివక్షలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని తెలిపారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఎనిమిది మంది, బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టును కూడా రాలేదని తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా, బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా వాటి ఫలితం మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ మరోసారి అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



