Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ పర్యాటకానికి మహర్దశ

తెలంగాణ పర్యాటకానికి మహర్దశ

- Advertisement -

రూ.22 వేల కోట్ల ఒప్పందాలు
90 వేల ఉద్యోగాల సృష్టి
భద్రతే ధ్యేయంగా టూరిస్ట్‌ పోలీస్‌ సేవలు
కొత్త విధానంతో సమగ్రాభివృద్ధి
విజయాలు, లక్ష్యాల ప్రకటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశంలో తెలంగాణ పర్యాటక శాఖ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి సాధించిందని తెలంగాణ పర్యాటక శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. 2025 సంవత్సరంలో పర్యాటక శాఖ సాధించిన ప్రగతిని, 2026లో సాధించబోయే లక్ష్యాలు భవిష్యత్‌ ప్రణాళికలను ఆ శాఖ అధికారులు ప్రకటించారు.

విజయాలు
ఎకో, మెడికల్‌, హెరిటేజ్‌, గ్రామీణ, గిరిజన, సినిమా, వెడ్డింగ్‌ డెస్టినేషన్‌, స్పోర్ట్స్‌ టూరిజంపై దృష్టి సారించి తెలంగాణ టూరిజం విధానం 2025-2030ని అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసినట్టు వివరించారు. టూరిజం కాంక్లేవ్‌ 2025 ద్వారా 30 ప్రాజెక్టులకుగాను రూ.15,279 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్టు చెప్పారు. తద్వారా సుమారు 50 వేల ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా రూ.7045 కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాల సృష్టి జరగనుందన్నారు. ముఖ్యంగా ఫుడ్‌లింగ్‌ గ్లోబల్‌ సెంటర్‌ రూ. 3000 కోట్లు, సారస్‌ ఇన్‌ఫ్రా రూ. 1000 కోట్లు, స్మార్ట్‌ మొబిలిటీ రూ. 1000 కోట్లు వంటి సంస్థలు భారత పెట్టుబడులతో ముందుకు వచ్చాయని వివరించారు. ప్రపంచ సుందరి పోటీలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. హైదరాబాద్‌ను పెట్టుబడులకే కాకుండా వ్యాపారానికి సురక్షిత, అనుకూలమైన రాష్ట్రంగా నిరూపితమైందని వివరించారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వేదికపై నిలబెడుతూ, అతిపెద్ద బతుకమ్మ(19.44 మీటర్లు), 1354 మంది మహిళలతో అతిపెద్ద జానపద నృత్యం ప్రదర్శించి సెప్టెంబరు 29, 2025న రెండు గిన్నస్‌ రికార్డులు సాధించామని ప్రకటించారు.

లక్ష్యాలు
2026 సంవత్సరానికి స్పష్టమైన ప్రణాళికను పర్యాటక శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌- సోమశిల-శ్రీశైలం సర్క్యూట్‌లో హెలీ టూరిజం సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. నాగార్జునసాగర్‌, సోమశిల, బస్వాపూర్‌ కొత్త వెడ్డింగ్‌ డెస్టినేషన్ల అభివృద్ధి చేయనున్నారు. మెడికల్‌ టూరిజం సొసైటిని స్థాపించి, హైదరాబాద్‌ను గ్లోబల్‌ మెడికల్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. జనవరి 13, 14, 15న అంతర్జాతీయ కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ షోలను నిర్వహించనున్నారు. ఇందులో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ, 55 మంది జాతీయ కైట్‌ ప్లేయర్ల భాగస్వాములు కానున్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ 2026, జనవరి 16 నుంచి 18 వరకు ఐరోపా దేశాలకు నుంచి వచ్చే ప్రతినిధులతో అంతర్జాతీయ 15 బెలూన్లల్లో ప్రదర్శన ఉంటుందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 13, 14న హైటెక్‌ డ్రోన్లతో వినూత్న ప్రదర్శన ఉంటుందని గుర్తు చేశారు. జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు వివరించారు. తెలంగాణ పర్యాటక రంగం కేవలం వినోదానికే పరిమితం కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే వనరుగా మారుతుందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -