– టైగర్ సెఫ్టీ అండ్ మానిటరింగ్ సెల్ ప్రారంభించడం హర్షణీయం : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టెక్నాలజీని ఉపయోగించి వన్యప్రాణి సంరక్షణ చేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రంలో వన్యప్రాణి భద్రతా టీం చేస్తున్న పనిని ఆమె అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో దేశంలోనే మొదటిసారి టైగర్ ప్రొటెక్షన్ సెల్‌ను ఆమె ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ, జూ శాఖల అధికారులు, సిబ్బంది వన్యప్రాణి రక్షణ కోసం ఇంకా ఎక్కువ నిబద్ధతతో పనిచేయాలని ఆమె కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో, వన్యప్రాణుల భద్రతకు, ప్రజల రక్షణకు కొత్తగా హైటెక్ టైగర్ మానిటరింగ్ సెల్, కమాండ్ హబ్ ఏర్పాటయిందని మంత్రి వివరించారు. ఈ పరిణామంతో పులుల సంచారం, టైగర్ రిజర్వులను తక్షణమే పర్యవేక్షించవచ్చని తెలిపారు. హైదరాబాదులోని స్టేట్ కమాండ్ సెంటర్‌కు, మన్ననూరు (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), మంచిర్యాల (కవల్ టైగర్ రిజర్వ్)లోని కొత్త రీజినల్ సెంటర్లు జత చేసినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. పులుల కదలికలను 24 గంటలూ పర్యవేక్షించేందుకు సీసీటీవీలు, కెమెరా ట్రాప్స్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నామని మంత్రి చెప్పారు. దీంతో వేటగాళ్ల ప్రవేశం లేదా అక్రమ కార్యకలాపాలను వెంటనే గుర్తించి అడ్డుకోవచ్చని వివరించారు. దాంతోపాటు, అటవీ ప్రాంతాల పక్కన నివసించే ప్రజల రక్షణ కూడా ఈ వ్యవస్థతో మరింత బలపడుతుందని తెలిపారు. పులి గ్రామాలకు చేరువైనప్పుడు వెంటనే అలర్ట్ వచ్చి, బృందాలు త్వరగా స్పందించి ప్రమాదాన్ని నివారించగలవని మంత్రి సురేఖ వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటల లోపు ఫీల్డ్ ఆఫీసర్లు తమ నివేదికలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సమావేశంలో మంత్రికి అధికారులు తెలిపారు. దాంతో ప్రభుత్వం ప్రతిరోజూ పక్కా సమాచారంతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. డేటాను టీజీఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీతో వన్యప్రాణి సంరక్షణ మరింత బలపడుతున్నదని గుర్తు చేశారు. ఈ కొత్త టైగర్ మానిటరింగ్ సెల్ అడవులను మరింత సురక్షితం చేస్తుందనీ, సిబ్బందికి మద్దతు ఇస్తుందనీ, రాష్ట్రంలో వన్యప్రాణుల భవిష్యత్తును కాపాడుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ ఎలు సింగ్ మేరు, డైరెక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



