Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఖనిజ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ

ఖనిజ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ

- Advertisement -

జాతీయ స్థాయి ఖనిజాభివృద్ధి కమిటీలో చోటే నిదర్శనం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కీలక ఖనిజ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఖనిజాల గుర్తింపు, మైనింగ్‌లో అగ్రభాగాన ఉందని గుర్తు చేశారు. ఇటీవల నీతి ఆయోగ్‌ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి స్థానం కల్పించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, రష్యా, ఘనా వంటి దేశాలతో వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చలు జరుపుతున్నామనీ, కీలక ఖనిజరంగంలో గల అవకాశాలను అధ్యయనం చేయటానికి ఇప్పటికే ఏజెన్సీలను నియమించామని తెలిపారు.

ఇటీవల కేంద్రం నిర్వహించిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్‌ సాధించిందన్నారు. సింగరేణి ప్రాంతంలోని గుట్టలు, ఓపెన్‌ కాస్ట్‌ గనుల మట్టి, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్‌, బాటమ్‌ యాష్‌లో ఉన్న కీలక ఖనిజాలు, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే వాటిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలపై కలిసి పని చేసేందుకు పలు జాతీయస్థాయి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. సింగరేణి కీలక ఖనిజ రంగంలో అవలంబిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని భట్టి పేర్కొన్నారు. 2,300 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లకు రాజస్థాన్‌ క్యాబినెట్‌ ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

నీతి ఆయోగ్‌ కమిటీలో సింగరేణికి స్థానం
కీలక ఖనిజ రంగంలో తెలంగాణ చూపిస్తున్న చొరవను నీతి ఆయోగ్‌ అభినందించింది. జాతీయ స్థాయి కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ కమిటీలో సింగరేణి సంస్థ సీఎండీని సభ్యునిగా నియమించింది. ఈ మేరకు గురువారం నీతి ఆయోగ్‌ డిప్యూటీ అడ్వైజర్‌ ఆర్‌.పద్మనాభం (మినరల్స్‌) ఆఫీస్‌ మెమోరండం జారీ చేశారు. కీలక ఖనిజాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రస్తుత తరుణంలో… ”ఓపెన్‌ కాస్ట్‌ గనుల ఓవర్‌ బర్డెన్లు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్‌, బాటమ్‌ యాష్‌, బొగ్గు సీముల్లో ఉన్న కీలక ఖనిజాలను గుర్తించి నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఏడాదిలోగా ఈ కమిటీ తన రిపోర్టును నీతి ఆయోగ్‌కు సమర్పించాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -