నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై సోమవారం జరిగిన దాడిని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి కె. మురళీమోహన్ సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ఉన్న దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే అది యావత్ భారత న్యాయవ్యవస్థపైనే దాడి చేసినట్టేనంటూ తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పునాదులకు మచ్చతెచ్చే సంఘటనగా భావిస్తున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు అత్యున్నత భారత న్యాయవ్యవస్థకు, న్యాయం పట్ల దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. అలాంటి పవిత్రస్థలంలో ఇలాంటి హేయమైన దుర్ఘటన చోటు చేసుకోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ బాధాకర ఘటనను యావత్ న్యాయమూర్తులు తీవ్రంగా ఖండించారని తెలియజేశారు. ఇలాంటి బెదిరింపులు, అవమానాలు, దాడులు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ఏ కోశానా భయపెట్టలేవని వివరించారు. నిష్పాక్షిక న్యాయపాలనను అడ్డుకోలేవని గుర్తు చేశారు. ఇలాంటి దాడులతో న్యాయమూర్తుల మనోధైర్యం ఎప్పటికీ దెబ్బతినదని హితవు పలికారు. న్యాయం కోసం , రాజ్యాంగ పరిరక్షణకోసం , చట్ట పరిపాలన కోసం మేము అచంచలంగా నిలబడతామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. న్యాయమూర్తులపై దాడి అంటే న్యాయవ్యవస్థపైన దాడి అని, ప్రజాస్వామ్య హదయంపై గాయంలాంటిది అభిప్రాయపడ్డారు. సత్యం మాత్రమే గెలుస్తుందన్నారు. సత్యం, న్యాయం, పరస్పర మర్యాద ఇవి మన మార్గదర్శక సూత్రాలని పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన మనువాదిని శిక్షించాలి : డీవైఎఫ్‌ఐ
న్యాయస్థానంలో సీజేఐపై చెప్పు విసిరి దాడిచేసిన కిషోర్ అనే న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే సీజేఐపై ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫెడరేషన్ ఖండన
సీజేఐపై దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య ఖండించారు. ఈ దాడితో సనాతన వాదుల భావ దారిద్య్రం బయటపడిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్న సీజేఐపై భౌతిక దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు.
సీజేఐపై దాడికి తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES