నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధినాయకత్వం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా అవకాశం ఇవ్వాల్సిన పేర్లను ఖరారు చేసింది. ప్రస్తుత మంత్రివర్గంలో ఒకరిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. పలువురి శాఖల్లో మాత్రం మార్పులు జరగనున్నాయి.
మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అన్నారు. వివిధ సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో కొంతమేర జాప్యం జరుగుతోందని చెప్పారు. తమ ప్రభుత్వంలో మంత్రులు అందరూ కలిసే ఉన్నారని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేసారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసు పెడతామని హెచ్చరిం చారు. ఈనెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని విమర్శించారు. బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణం, మహిళలకు కాంగ్రెస్‌లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలో లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ పైన హైకమాండ్ వద్ద ఇప్పటికే చర్చలు జరిగాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు పైన రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా, రాజగోపాల్ తో పాటుగా వివేక్ కు పార్టీలో చేరే సమయంలోనే హామీ ఇచ్చిన విషయాన్నినేతలు గుర్తు చేసారు.
నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఖాయంగా కనిపిస్తోంది.అదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ కు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో.. రాజ గోపాల్ కు ఇప్పడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది. ఇక.. ఇటివల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయకర్ తన సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరో ఎమ్మెల్సీ, మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మహిళా నేతగా విజయశాంతికి చోటు దక్కె అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే రేవంత్ మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలకు చోటు దక్కినట్లు అవుతుంది. సీఎం వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి. విద్య, హోం, గనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. దీంతో..కొత్తగా వచ్చే వారికి ఈ శాఖలు కేటాయిస్తారనే అంచనాలు ఉన్నా…ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరి శాఖల సర్దుబాటు ఉంటుందనే వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.
ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES