– పీపీఏ, జీఆర్‌ఎంబీకి లేఖ
– సీడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం నీటిపారుదల డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపట్ల తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) జి అనిల్‌కుమార్ గోదావరి బోర్డుతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్టు ఏప్రిల్ 8న జరిగిన పీపీఏ సమావేశంలో పోలవరం చీఫ్ ఇంజినీర్ తెలిపినా, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ సన్నాహాలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని గుర్తు చేశారు. దీంతో గోదావరి డెల్టా వ్యవస్థ ప్రయోజనాలకు కూడా నష్టం వస్తుందని లేఖలో తెలియజేశారు. ప్రధానంగా పోలవరం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రాజెక్టుకూ నీటిలభ్యత లేదంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూనే మరోవైపు డెడ్‌స్టోరేజీ నుంచి కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం ఎంతవరకు సమంజమని లేఖ ద్వారా తీవ్ర అభ్యంతరం చెప్పారు. డెడ్‌స్టోరేజీ నుంచి ఎత్తిపోతల చేపట్టడం సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, అనుమతులకు విరుద్ధ మని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది. సీడబ్ల్యూసీ వెంటనే జోక్యం చేసుకుని ఏపీని అడ్డుకోవాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ కోరారు. పోలవరం నుంచి ఎత్తిపోతల చేపట్టకుండా చూడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులకు ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉందని లేఖలో వివరించారు. తక్షణమే గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టుపై ఏపీ ముందుకు పోకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం డెడ్‌స్టోరేజీ ఎత్తిపోతలకు తెలంగాణ అభ్యంతరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES