ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘రబీ సీజన్‌లో యూరియా సహా ఎరువులను సమయానుసారంగా, తగిన మోతాదులో సరఫరా చేయాలి. ఎరువుల కొనుగోలులో ఉన్న 25 శాతం పరిమితిని అన్ని పంటలకూ తొలగించాలి. జొన్న, మొక్కజొన్నలను ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌లో చేర్చాలి. నూనె గింజల విలువ ఆధారిత ప్రోడక్ట్స్ ప్రోత్సాహానికి ఆయిల్ సీడ్స్‌పై ఉన్న సబ్సిడీని 33 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. తెలంగాణ విత్తన రంగానికి జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. దేశంలో అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం విత్తనాలను సరఫరా చేస్తూ.. 20కిపైగా దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నాడిక్కడ నిర్వహించిన జాతీయ రబీ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించారు.
అనంతరం మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ సదస్సుతో రాష్ట్రాలన్నీ ఒకే వేదికపై కలసి అనుభవాలను పంచుకుంటూ, పరస్పరం నేర్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగే అవకాశాలు ఏర్పడుతాయి. ఇతర రాష్ట్రాల వారు ఇచ్చే ప్రదర్శనలు, చర్చలు, బ్రేక్‌అవుట్ సెషన్లతో వారి అనుభవాలను పంచుకుని, సమస్యలను కలిసి పరిష్కరించే అవకాశం కల్పిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘విత్తనాలతో పాటు నూనెగింజల పంటల్లో.. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1.5 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. దీన్ని త్వరలో 8 లక్షల హెక్టార్లకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందించాం. రైతులను సాంప్రదాయ పంటల నుంచి.. ఈ పంట వైపు ఆసక్తి చూపేలా చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది’ అని అన్నారు.
‘తెలంగాణ రాష్ట్రంలో బియ్యం, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, వేరుశనగ, మిరప, పసుపు, సిరిధాన్యాలు వంటి పంటలు విస్తతంగా పండుతాయి. అందులో తాండూరు కంది, చపాటా మిరప జాతీయ స్థాయిలో జీఐ గుర్తింపును పొందాయి. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా, ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా, పంట రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీలు వంటి పథకాలు రైతులకు భద్రత, నమ్మకాన్ని కలిగించాయి’ అని మంత్రి వివరించారు. ‘2,601 రైతు వేదికలు ఏర్పాటు చేయడం, ప్రతీ వారం రైతు నేస్తం లాంటి డిజిటల్ సమావేశాలు నిర్వహించడం ద్వారా.. 13లక్షల మంది రైతులు, అందులో 3 లక్షల మంది మహిళా రైతులు నేరుగా శాస్త్రవేత్తలు, అధికారులను కలవగలుగుతున్నారు’ అని మంత్రి తుమ్మల వివరించారు. ‘పాలసీ స్థాయిలో రాష్ట్రానికి కొన్ని ఆందోళనలు ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రాలకు తక్కువ స్వేచ్ఛ ఉంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే సౌలభ్యం ఉండాలి.
చిన్న చిన్న పథకాలు ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. వీటిని సమన్వయం చేసి సరళీకతం చేస్తే రైతుకు ఎక్కువగా లబ్ది చేకూరుతుంది. ఉత్పత్తి, దిగుబడి కంటే ముఖ్యమైంది. రైతు ఆదాయం పెరిగే విధంగా పాలసీలు తయారు చేయడంపై దష్టి సారించాలి’ అని ఆయన సూచించారు. ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలా.. రైతుల ఆదాయం నిజంగా పెరుగుతోందా అని తరచూ సర్వేలు చేయాలి. యూరియాకు అధిక సబ్సిడీ ఇవ్వడం వల్ల, యూరియా వాడకం పెరిగి నేలలో పోషకాల అసమతుల్యత పెరుగుతోంది. కాబట్టి ఎరువుల ధరలు సవ్యంగా ఉండి, సమతుల్య పోషకాల వాడకాన్ని ప్రోత్సహించాలి. సీడ్ చట్టాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పున్ణసమీక్షించి, నాణ్యత లేని విత్తనాలు అమ్మేవారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాలు తేవాలి’ అని మంత్రి అన్నారు.
కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌తో భేటీ..
అంతకుముందు.. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఖరీప్ సీజన్‌లో ప్రణాళిక ప్రకారం.. ఇప్పటిదాక ఏర్పడిన యూరియా లోటు 2 లక్షల టన్నులను ఈ నెలలోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రతి నెలా రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. అయితే.. జియోపొలిటికల్ కారణాల వల్లనే సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ హామీ ఇచ్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల మంత్రి హెచ్.డి కుమారస్వామిని కూడా కలిసినట్టు తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని కేంద్రమంత్రి దష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే సమావేశం అవుదామని కేంద్రమంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం
కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఎంతో అవసరం అని వివరించారు. కొత్తగూడెంలో గతంలో ప్రతిపాదించిన విమానాశ్రయంపై సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కొత్తగూడెం, భద్రాచలం రామ భక్తులకు ప్రధాన తీర్థయాత్ర కేంద్రంగా ఉందని.. రామ్మోహన్ నాయుడుకు వివరించారు. సింగరేణి బొగ్గు క్షేత్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, బీపీఎల్ యూనిట్లు వంటి పరిశ్రమలకు కేంద్రంగా ఉందని చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కొత్తగూడెం ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ అవసరం. కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. కొత్త, అనువైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో తాజా సాధ్యాసాధ్యాలకు సంబంధించి అధ్యయనాన్ని చేపట్టాలని.. ఇదే అంశంపై సంబంధిత అధికారులను ఆదేశించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి పట్ల.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.