అందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి
స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమావేశంలో ఎవరు ఏమన్నారంటే..
క్రీడా సంస్కృతిని పెంపొందించాలి. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. అప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయి. హర్యానాలో ప్రతి పల్లెకు కుస్తీతో అనుబంధం ఉంటుంది. అదే తరహా ఇక్కడా ఓ క్రీడను పల్లెల్లోకి తీసుకెళ్లాలి.
– కపిల్ దేవ్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్
ప్రతి పాఠశాలలో వ్యాయాయ విద్య ఉపాధ్యాయుడు, ఫిజికల్ డైరెక్టర్ ఉండేలా చూడాలి. క్షేత్ర స్థాయిలో క్రీడా సంస్కృతి బలోపేతానికి ఇది పునాది వేస్తుంది.
– అభినవ్ బింద్రా,
షూటింగ్‌లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్
గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలు దశలవారీగా ఉండాలి. అప్పుడే మెరుగైన క్రీడాకారుల గుర్తింపు, ఎంపిక సాధ్యపడుతుంది.
– పుల్లెల గోపీచంద్,
జాతీయ బ్యాడ్మింటన్ కోచ్
స్పోర్ట్స్ యూనివర్శిటీలో ఫిజియోథెరపి కోర్సులను ప్రవేశపెట్టాలి. క్రీడా సామాగ్రిపై పన్నుల భారం అధికంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
– ఉపాసన కొణిదెల,
స్పోర్ట్స్ హబ్ కో చైర్మెన్
గ్రామ స్థాయిలో స్టేడియాలు, క్రీడా సామాగ్రి అందుబాటులో ఉంటే నాణ్యమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ఇంగ్లాండ్ తరహాలో ప్రతి ఆటలో లీగ్ పోటీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– బైచుంగ్ భూటియా,
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న స్టేడియాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. స్టేడియాల నిర్వహణ మెరుగుపరచాలి.
– రవికాంత్ రెడ్డి, మాజీ వాలీబాల్ ఆటగాడు
ప్రపంచ ప్రముఖ కంపెనీల సీఈవోలు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు. రాష్ట్ర క్రీడాభివృద్ధికి ఈ సీఈవోల సేవలను వినియోగించుకోవాలి.
– సంజీవ్ గోయెంకా, స్పోర్ట్స్ హబ్ చైర్మెన్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో ఐటీ సంస్కృతి బలంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో రాణించాలని కోరుకుంటున్నారు. అదే తరహాలో తెలంగాణలో క్రీడా సంస్కృతి రావాలి. క్రీడల్లో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి. అందుకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతుల ఆధునీకరణ, కోచ్‌లకు శిక్షణ, క్రీడా పాలసీలో పలు అంశాలపై ప్రణాళిక రూపకల్పన, నిర్ణయాల అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు తీర్మానాలు చేసింది. ఖేలో ఇండియా, కామన్‌వెల్త్ గేమ్స్ సహా ఒలింపిక్స్ పోటీలు భారత్‌లో నిర్వహిస్తే.. సహా ఆతిథ్య అవకాశం హైదరాబాద్‌కు కల్పించాలని స్పోర్ట్స్ హబ్ బోర్డు తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ శివసేనా రెడ్డి, స్పోర్ట్స్ హబ్ బోర్డు చైర్మెన్ సంజీవ్ గోయెంకా, కో చైర్మెన్ ఉపాసన కొణిదెల, సభ్యులు కపిల్‌దేవ్, అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, వీతా దానీ, పాపారావు, శశిధర్‌లు సమావేశంలో పాల్గొన్నారు.
స్పోర్ట్స్‌కు హైదరాబాద్ వేదిక కావాలి
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తొలి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను సభ్యులతో పంచుకున్నారు. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానంలో అందరూ హైదరాబాద్‌ను మోడల్‌గా చర్చించుకోవాలని నా లక్ష్యం. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో పోల్చితే స్పోర్ట్స్ బడ్జెట్‌ను 16 రెట్లు పెంచాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. క్రీడా రంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా స్టేడియాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావటం లేదు. క్రీడా వనరులను సమగ్రంగా సద్వినియోగం చేసుకోవటం, క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు స్పోర్ట్స్ హబ్ బోర్డు కార్యాచరణ రూపొందించాలి. క్రీడా రంగం అభివృద్దికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే స్పోర్ట్స్ హబ్ బోర్డులో ప్రముఖ కార్పోరేట్లు, క్రీడాకారులు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లకు చోటు కల్పించామని’ సీఎం తెలిపారు.
క్రీడా పోటీల విధానంలో మార్పు
‘నాణ్యమైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రస్తుత క్రీడా పోటీల విధానంలో మార్పు చేస్తున్నాం. గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలు తొలి దశలో నిర్వహించి.. శాసనసభ నియోజకవర్గ స్థాయిలో విజేతలకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. ఆ తర్వాత, అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తాం. క్రీడా సామాగ్రిపై ఉన్న పన్నుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం. మా స్థాయిలో అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీలో ఫిజియోథెరపీ సహా ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతాం. స్టేడియాలు, అకాడమీలు పెద్ద సంఖ్యలో ఉన్నా కోచ్‌లు లేరు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్టు కోచ్‌లకు శిక్షణ అందించటం సహా రానున్న మూడేండ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై బోర్డు కార్యాచరణ రూపొందించాలని’ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.