Saturday, August 2, 2025
E-PAPER
Homeఆటలునేడు తెలంగాణ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌

నేడు తెలంగాణ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌

- Advertisement -

– క్రీడా పాలసీ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
– హాజరు కానున్న ఒలింపియన్లు, మాజీ క్రీడాకారులు
నవతెలంగాణ-హైదరాబాద్‌

పదేండ్లుగా ఎటువంటి క్రీడా పాలసీ లేకుండా సాగిన తెలంగాణ క్రీడా రంగం… రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరికొత్త పరుగులు పెడుతోంది. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన తొలి క్యాబినెట్‌ సమావేశంలో క్రీడా విధానానికి ఆమోద ముద్ర పడేలా చేయగా.. తాజాగా తెలంగాణ తొలి స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌కు సిద్ధమైంది. ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు, దేశంలో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపటమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న తెలంగాణ నూతన క్రీడా పాలసీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరిగే తొలి స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌ జరుగనుంది. భారత ఒలంపియన్లు, మేటీ క్రీడాకారులు అభినవ్‌ బింద్రా, గగన్‌ నారంగ్‌, పుల్లెల గోపీచంద్‌, రవికాంత్‌ రెడ్డి, అంజూ బాబి జార్జీ సహా పలు జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు ఈ క్రీడా సమావేశానికి హాజరు కానున్నారు.
ఐదు ప్రధాన అంశాలతో తెలంగాణ క్రీడా పాలసీని రూపొందించగా.. నేడు స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌లోనూ ఆ అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. క్రీడా విధాన నిర్వహణ, క్రీడారంగంపై సానుకూలత పెంచటం, క్రీడాభివద్దికి దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన, క్రీడా మైదానాల అభివద్ది సహా క్రీడాకారుల నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై స్పోర్ట్స్‌ పాలసీలో పొందుపరిచారు. క్రీడల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు స్పోర్ట్స్‌ పాలసీ అమలు, కాలానుగుణ సమీక్ష, అందించాల్సిన ప్రోత్సాహకాలు, క్షేత్ర స్థాయిలో ప్రతిభాన్వేషణ సహా పలు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరించనున్న విధానాలను ఈ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌లో ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ తొలి స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌కు హెచ్‌ఐసీసీలో రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పలువురు మేటీ క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా పాత్రికేయులు సహా రాష్ట్ర క్రీడా యంత్రాంగం పాల్గొననున్న క్రీడా సమ్మేళనానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి శుక్రవారం హెచ్‌ఐసీసీ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి, కార్యక్రమం విజయవంతం చేయటానికి నిర్వాహకులు పలు సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -