గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ
హైదరాబాద్ : తెలంగాణ టీ20 లీగ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఓ అడుగు ముందుకేసింది. పొట్టి ఫార్మాట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా యువ ప్రతిభను వెలికితీసేందుకు, గ్రామీణ క్రికెటర్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ టీ20 లీగ్ ఉపయుక్తంగా ఉంటుందని హెచ్‌సీఏ భావిస్తోంది. ఏడుగురు సభ్యులతో తెలంగాణ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నట్టు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్, సీఈవో ఇంతియాజ్ ఖాన్, కాగ్ ప్రతినిధి రాజశేఖర్, క్రికెటర్ల సంఘం ప్రతినిధి పార్థ్ సహా ఏజీఎం జాబితా (హెచ్‌సీఏ సభ్యులు) నుంచి ఆగమ్ రావు, సంజీవ్ రెడ్డిలు గవర్నింగ్ కౌన్సిల్‌లో ఉన్నారు. తెలంగాణ టీ20 లీగ్‌లో ఎన్ని జట్లు ఉండాలి, టోర్నీ ఫార్మాట్, షెడ్యూల్ తదితర అంశాలను గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించనుంది.



